రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్.. ఢిల్లీ పర్యటన ఆపేందుకేనా?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్టు చేశారా..? ఆయన ఇంటి వద్ద ఉన్న పోలీసు బలగాలను చూస్తుంటే.. అదే నిజమని ఎవరికైనా అర్థమౌతుంది. కాగా.. ఇప్పుడు ఆయనను ఎందుకు హౌస్ అరెస్టు చేశారనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీ పర్యటనను అడ్డుకునేందుకే ఈ హౌస్ అరెస్టు చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే… తెలంగాణ ప్ర‌భుత్వం ఇటీవ‌లే వేలం వేసిన కోకాపేట భూముల వేలంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, కేసీఆర్- కంపెనీలు కుమ్మ‌క్కై 1000కోట్లు ప్ర‌భుత్వానికి న‌ష్టం చేశార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 60కోట్ల‌కు పైగా ఎక‌రం ప‌ల‌కాల్సిన భూమిని కేవ‌లం 30కోట్ల పైచిలుకు రేట్ల‌కే అమ్మేశార‌ని… పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని రేవంత్ రెడ్డి ఆధారాల‌తో స‌హా మీడియా ముందు డ్యాక్యుమెంట్స్ ఇచ్చారు. అంతే కాదు పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు వెళ్లి, అక్క‌డే హోంమంత్రి అమిత్ షాకు, ప్ర‌ధానికి ఫిర్యాదు చేస్తాన‌ని… విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరుతాన‌ని హెచ్చ‌రించారు.

ఇంట‌లిజెన్స్ ప్ర‌భాక‌ర్ రావు, సీఎస్ సోమేష్ కుమార్ ల అవినీతి అంశాల‌ను కూడా రేవంత్ రెడ్డి ప్ర‌స్తావిస్తాన‌ని చెప్పిన రెండ్రోజుల‌కే రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసు బ‌లగాలు మొహ‌రించారు. రేవంత్ రెడ్డిని ఢిల్లీ వెళ్ల‌కుండా అడ్డుకునేందుకే ఈ పోలీసులు వ‌చ్చార‌ని రేవంత్ వ‌ర్గీయులు ఆరోపిస్తున్నారు.