అందుకే సైలెంట్‌గా ఉన్నారా?

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం సాధార‌ణం. అధికారంలో ఉన్న పార్టీ వైఫ‌ల్యాల‌ను ఎత్తి చూపుతూ ప్ర‌తి ప‌క్ష పార్టీలు గొంతు పెంచ‌డం అందుకు త‌గిన‌ట్లుగా ప్ర‌భుత్వంలో ఉన్న నేత‌లు స్పందించ‌డం చూస్తూనే ఉంటాం. కానీ తెలంగాణ‌లో త‌న తండ్రి పేరుతో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై అధికార టీఆర్ఎస్ కౌంట‌ర్ ఇవ్వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. టీఆర్ఎస్ అనే కాదు ప్ర‌ధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ కూడా ఆమెను ఒక్క మాట కూడా అనడం లేదు. అయితే ఈ పార్టీలు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వెన‌కాల ఓ వ్యూహం ఉంద‌నే మాట వినిపిస్తోంది.

తెలంగాణ‌లో వ‌చ్చే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం కోసం ఇటు టీఆర్ఎస్, ఎలాగైనా గ‌ద్దెక్కెలాని అటు కాంగ్రెస్‌, బీజేపీ ఇప్ప‌టి నుంచే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. ఆ దిశ‌గా పార్టీలో మార్పులు చేర్పుల‌తో అన్ని అస్త్రాల‌నూ సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన ష‌ర్మిల వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తాచాటుతామ‌నే ధీమాతో ఉన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే ల‌క్ష్యంగా ముందుకు సాగుతామ‌నే ఆత్మ‌విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వైఎస్సార్ అభిమానుల‌తో పాటు రెడ్డి సామాజిక వ‌ర్గం కూడా ఆమెకు కాస్త అండ‌గా నిలిచే అవ‌కాశాలున్నాయి. దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై విమ‌ర్శ‌ల బాణం ఎక్కుపెట్టిన ఆమె దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది.

ష‌ర్మిల ఎన్ని మాట‌ల‌న్నా స్పందించ‌క‌పోవ‌డమే టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఉమ్మ‌డి వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. అస‌లు ష‌ర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఓ పార్టీగానే చూడ‌ట్లేద‌ని ఆయ‌న బాహాటంగానే తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ కూడా ఇదే పంథాలో సాగుతోంది.

నిరుద్యోగుల‌కు అండ‌గా నిల‌వ‌డం కోసం వారానికి ఒక‌సారి దీక్ష చేసేందుకు సిద్ధ‌మైన ష‌ర్మిల‌పై కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. వారానికి ఒక‌సారి మ‌హిళ‌లు వ్ర‌తం చేసిన‌ట్లు ష‌ర్మిల దీక్ష ఉంద‌ని ప‌రోక్షంగా పేర్కొన్నారు. ఇక బీజేపీ అయితే ఆమె పేరే ఎత్త‌ట్లేదు. అన‌వ‌స‌రంగా ఆమెపై కౌంట‌ర్లు వేసి ఆమెకు గుర్తింపు ద‌క్కేలా చేయ‌డం ఎందుక‌ని భావించిన ఈ పార్టీలు ష‌ర్మిల ఉనికినే గుర్తించ‌డానికి నిరాక‌రిస్తున్నాయి. ష‌ర్మిల విమ‌ర్శ‌ల‌పై స్పందిస్తే అన‌వ‌స‌రంగా ఆమెకు లేని ప్రాధాన్య‌త‌, గుర్తింపు తామే ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని ఈ పార్టీలు ప‌క్కా వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. మ‌రోవైపు ష‌ర్మిల మాత్రం త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ సాగుతోంది. ఆమె ఇదే దూకుడు కొన‌సాగిస్తే త‌న మాట‌ల‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీలు స్పందించే స‌మ‌యం రాక‌పోదా చూద్దాం.