శ్మ‌శానాన్నీ అమ్మేయాల‌నుకున్న కేసీఆర్‌.. కానీ.. బిగ్ బ్రేక్‌!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని కేసీఆర్‌ ప్ర‌భుత్వం ఆర్థిక క‌ష్టాల్లో ఉంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ భూముల‌ను వేలానికి పెట్టింది. కోకాపేట్‌లో ప్రారంభ‌మైన ఈ భూములమ్మే ప్ర‌క్రియ‌.. ఖానామెట్‌వ‌ర‌కు పెరిగింది. కోకా పేట‌లో కోట్ల రూపాయలు పలికిన ప్రభుత్వ భూముల ధరలు.. ఖానామెట్‌లోనూ అదే పరంపరను కొనసాగించాయి. ‘ఇ-ఆక్షన్‌’లో ఎకరానికి అత్యధికంగా రూ.55 కోట్లు పలికింది. కోకాపేటలో ఎకరానికి అత్యధికంగా రూ.60.20 కోట్లు రాగా.. ఇక్కడ రూ.5 కోట్లు తగ్గాయి. ఖానామెట్‌లో 14.91 ఎకరాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.729.41 కోట్ల సొమ్మును ఆర్జించింది.

ఆదాయ వనరులను సమీకరించుకోవడంలో భాగంగా ప్రభుత్వం భూములను అమ్మకానికి పెడుతున్న సంగతి తెలిసిందే. మొదటి దశలో కోకాపేట, ఖానామెట్‌లలోని భూములను అమ్మాలని నిర్ణయించింది. కోకాపేటలో 49.94 ఎకరాల భూమిని విక్రయించగా.. రూ.2000.37 కోట్లు వచ్చాయి. ఖానామెట్‌లోని టీఎ్‌సఐఐసీకు చెందిన 14.91 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. మొత్తానికి.. సగటున ఎకరానికి రూ.48.92 కోట్ల మేర ధర పలికింది. 2.92 ఎకరాలతో కూడిన 14వ నెంబరు ప్లాట్‌కు అత్యధికంగా ఎకరానికి రూ.55 కోట్ల ధర లభించింది.

కోకాపేటలో హెచ్ఎండీఏ వేలం పాటలో రికార్డు ధర దక్కించుకున్నప్ప‌టికీ.. ఇక్క‌డి భూ బాధితులు స‌ద‌రు భూముల చుట్టూ ఉన్న తమ నివాసాల కోసం చేస్తున్న ఆందోళన చేప‌ట్టారు. ఇప్పటి వరకు ఖానాపూర్‌ వాసులు ఆందోళన చేస్తుండగా ఇప్పుడు కోకాపేట సబితానగర్‌ వాసులు వారికి తోడయ్యారు. హెచ్ఎండీఏ వేలం వేసిన భూములలో తమకు ఇచ్చిన పట్టాలకు పొజిషన్‌ ఇవ్వాలంటూ ఖానాపూర్‌ వాసులు న్యాయపోరాటం, ధర్నాలు చేశారు. మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇదిలావుంటే, ఈ భూముల వేలం ప్ర‌క్రియ‌లో భాగంగా ప్ర‌భుత్వం ఏకంగా శ్మ‌శాన స్థ‌లాల‌ను కూడా వేలం వేసేందుకు సిద్ధ‌మైంది. అయితే.. ఇప్పుడు దీనికి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను ప్రభుత్వం వేలం వేసింది. కాగా 15 ఎకరాల్లో మూడెకరాల శ్మ‌శానం ఉంది. ఆ శ్మ‌శాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టింది. దీంతో ఈ వేలాన్ని ఆపాలంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. తమ పూర్వికుల సమాధులున్నాయని కోర్టుకు స్థానికులు నివేదించారు. తాము సెంటిమెంట్‌గా భావించే సమాధులను పరిరక్షించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఈ వేలాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం, కేసీఆర్ స‌హా మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.