తొందరలోనే జగన్మోహన్ రెడ్డికి డేంజర్ బెల్స్ మోగటం ఖాయమనే అనిపిస్తోంది. అయితే ఈ డేంజర్ బెల్స్ మోగించేది మామూలు జనాలు కాదు ఉద్యోగులే అనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే ఉద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూసే పీఆర్సీ గురించి ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. దీనికి అదనంగా బకాయిలున్న డీఏల విషయంలో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారన్నది వాస్తవం.
నిజానికి ఉద్యోగులకు రెండు బకాయిలను 2018 లోనే పీఆర్సీ వేయాల్సింది చంద్రబాబు ప్రభుత్వమే. అయితే అప్పట్లో చంద్రబాబు ఆపని చేయలేదు. దాంతో ఆ రెండు జగన్ ప్రభుత్వానికి క్యారీ ఫార్వార్డ్ అయ్యింది. దీనికి అదనంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లించాల్సిన బకాయిలు+కొత్త డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పీఆర్సీ కూడా ప్రకటించాలి. పనిలో పనిగా సీపీఎస్ రద్దు విధానంపైన కూడా ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు.
ఉద్యోగులకు ఎప్పుడు కూడా తమకు రావాల్సిన దానిపైనే దృష్టుంటుంది. అందాల్సినది అందకపోయేసరికి అసంతృప్తి పెరిగిపోతుంది. ఒకవైపు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తోంది. ఇదే సమయంలో డీఏలకు చెల్లించాల్సిన సుమారు రు. 12 వేల కోట్లు పెండింగ్ లో పెట్టింది.
ఇక్కడ విషయం ఏమిటంటే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నది మళ్ళీ ఉద్యోగులే. అంటే తమ చేతుల మీదగానే వేల కోట్ల రూపాయలను పంపిణీ చేస్తన్న ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్ధికప్రయోజనాలను మాత్రం రాబట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నిధులను ఎక్కడినుండి తీసుకొస్తుందనేది ఉద్యోగులకు అవసరంలేదు.
తమ ప్రయోజనాలను రాబట్టుకోలేకపోతే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతుంది. కరోనా వైరస్ వచ్చిందా ? లేకపోతే తుపానులు వచ్చాయా అన్నది ఉద్యోగులకు అనవసరం. కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల డీఏలను కేంద్రం వాయిదా వేసింది. అయితే డీఏని 11 శాతం పెంచి వెంటనే అమల్లోకి తెచ్చింది. మరి జగన్ ఏమి చేస్తాడనేది ఉద్యోగులు గమనిస్తున్నారు. ఏదో రోజు డీఏలు+పీఆర్సీల బాంబు పేలేట్లుగానే ఉంది. కాబట్టే జగన్ కు డేంజర్ బెల్స్ తప్పేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.