గత కొంత కాలంగా సెక్షన్ 124-Aపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని, రాజకీయ ప్రయోజనాలకోసం కొందరిపై ఉద్దేవపూర్వకంగా రాజద్రోహం కేసు పెట్టేందుకు ఆ సెక్షన్ దోహదపడుతోందని కొందరు వాదిస్తున్నారు. బ్రిటిషు కాలం నాటి ఆ చట్టాన్ని ఇంకా అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సెక్షన్ 124-A ను రద్దు చేయాలని, చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఆ సెక్షన్ ఉల్లంఘిస్తోందని రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్…సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
ఈ సందర్భంగా ఆ సెక్షన్ పై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ షాకింగ్ కామెంట్లు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేయడానికి 124-A సెక్షన్ ను కొందరు దుర్వినియోగపరుస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ సెక్షన్ కింద నామమాత్రంగానే శిక్షలు పడుతున్నాయని, రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికే చాలామంది ఈ సెక్షన్‌ను ఉపయోగించిన ఉదంతాలు ఉన్నాయన్నారు. దేశానికి స్వేచ్ఛనిచ్చేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి ఆపాటి బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? కాదా? అని పరిశీలించాలని అన్నారు.
ఈ సెక్షన్ పై దాఖలైన అన్ని పిటిషన్ల విచారణ జరుపుతామని, ఈ వ్యవహారంలో కేంద్రానికి నోటీసులు జారీ చేశామని అన్నారు. మరి, ఈ నోటీసులపై కేంద్రం స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.