హుజూరాబాద్ ఉపఎన్నికల విషయంలో తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కసారిగా జోరుపెంచారు. ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పార్టీ తరపున ఇన్చార్జిలను నియమించారు. ఇదే సందర్భంలో తాను కూడా తొందరలోనే నియోజకవర్గంలో క్యాంపు వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 12 మందిని ఇన్చార్జీలుగా నియమించారు.
అలాగే ఓవరాల్ గా నియోజవర్గం బాధ్యతలు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహకు అప్పగించారు. ఇదే సమయంలో సమన్వయకర్తలుగా మాజీమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తో పాటు మరో మాజీమంత్రి జీవన్ రెడ్డిని కూడా నియమించారు. జీవన్ ప్రస్తుతం రేవంత్ మీద అలిగిన విషయం తెలిసిందే. ఎందుకంటే రేవంత్ తో పాటు జీవన్ రెడ్డి కూడా పార్టీ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
ఇక విషయానికి వస్తే మండలాల ఇన్చార్జిలు ఉపఎన్నిక అయ్యేవరకు స్ధానిక నేతలతోనే టచ్ లో ఉండాలని గట్టిగా చెప్పారు. తమకు కేటాయించిన మండలాల్లో నేతలంతా పర్యటించి పార్టీ నేతలను, శ్రేణులతో సమావేశమవ్వాలని ఆదేశించారు.
సరే ఇన్చార్జీలను బీజేపీ, టీఆర్ఎస్ ఎప్పుడో నియమించేశాయి. కాకపోతే అప్పట్లో లేని జోష్ రేవంత్ నియామకంతో కాంగ్రెస్ లో కనబడుతోంది. చివరకు అందరు కలిసి ఏమి చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates