సినీ జనాల్లో చాలామంది రాజకీయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డానికి చాలా భయపడతారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వాళ్లో, లేదంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించిన వాళ్లో ఒక పార్టీ వైపు నిలబడి ఇంకో పార్టీ నేతల మీద విమర్శలు చేయడమే తప్పితే.. రాజకీయాలకు దూరంగా, తటస్థంగా ఉంటూ సమస్యల మీద ప్రభుత్వాలను నిలదీసేవాళ్లు తక్కువ.
గత కొన్నేళ్లలో అయితే ఇలాంటి వాళ్లు మరీ అరుదైపోయారు. ఐతే ఒకప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిన దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మాత్రం తాజాగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కోట ఒక ఇంటర్వ్యూలో సూటిగా విమర్శలు చేశారు. ఏపీలో తెలుగు మీడియం తీసేసి పూర్తిగా ఇంగ్లిష్ మీడియం పెట్టాలన్న జగన్ సర్కారు నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
జగన్ తండ్రి వైఎస్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారని.. ఆయన తెలుగు మీడియంలోనే చదువుకున్నారని.. ఆయనకు ఇంగ్లిష్ ఎవరు నేర్పారని కోట ప్రశ్నించారు. తాను 1966లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, తాను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నానని.. తమకు అప్పట్లో ఇంగ్లిష్ ప్రత్యేకంగా ఓ సబ్జెక్ట్‌గా ఉండేదని.. ఆ రోజుల్లోనే షేక్స్పియర్ డ్రామాలను చదువుకున్నామని.. ఐతే ఇప్పుడు జగన్ కొత్తగా ఇంగ్లిష్ మీడియం అంటూ ప్రత్యేకంగా పెట్టేదేముందని కోట ప్రశ్నించారు.
రాజకీయ నాయకులు తమ వైఫల్యాల మీద జనాల దృష్టిపడకుండా ఎప్పటికప్పుడు కొత్త ఇష్యూలు తెస్తుంటారని.. ఇంగ్లిష్ మీడియం వివాదం కూడా అలాంటిదే అని.. మొన్నటిదాకా రఘురామకృష్ణంరాజు గొడవ.. ఆ తర్వాత కృష్ణా జలాల వివాదం.. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఇష్యూను తెరపైకి తెచ్చి తమ గురించి జనాలు ఏమీ అనుకోకుండా చూసుకుంటారని.. జగన్‌తో పాటు కేసీఆర్ కూడా అదే చేస్తున్నారని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేతలు నిద్ర నటిస్తున్నట్లుగానే ఉందని కోట వ్యాఖ్యానించారు.