జనాల చెవిలో పువ్వు

Somu Veeraju

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జనాల చెవిలో పువ్వులు పెడుతున్నారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరి ప్రైవేటుపరం కాదని బల్లగుద్ది చెప్పారు. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర బీజేపీ అడ్డుకుంటుందని వీర్రాజు గట్టిగా చెప్పారు. నిజానికి స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంలో వీర్రాజు తన పరిధిని దాటే మాట్లాడేశారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసే విషయంతో అసలు వీర్రాజుకు సంబంధమే లేదు, అడ్డకునేంత సీన్ ఆయనకు లేదు.

ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు రాష్ట్రానికే సంబంధంలేదు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కేంద్రప్రభుత్వ సంస్ధ. ఫ్యాక్టరీని కేంద్రం పరిధిలోనే కంటిన్యు చేస్తుందా లేకపోతే ప్రైవేటుపరం చేస్తుందా అన్నది పూర్తిగా కేంద్ర నిర్ణయం మీద ఆధారపడుంటుంది. అందుకనే ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసేయాలని ఇఫ్పటికే కేంద్రం డిసైడ్ చేసేసింది.

ప్రైవేటుపరం చేసే విషయంలో ఇప్పటికే కేంద్రం అనేక చర్యలు తీసుకున్నది. దక్షిణకొరియా సంస్ధ పోస్కో యాజమాన్యంతో అనేకసార్లు చర్చలు జరిపింది. సంస్ధ యాజమాన్యం ఇప్పటికే రెండు మూడుసార్లు వైజాగ్ వచ్చి ఫ్యాక్టరీ మొత్తాన్ని చూసుకువెళ్ళింది. ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయటానికి వీలుగా న్యాయసలహాలు ఇవ్వటానికి, మార్గదర్శనం చేయటానికి వీలుగా న్యాయసలహదారు నియామకానికి కేంద్రం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.

ఇదంతా ఒకఎత్తైతే ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుపరం చేయబోతున్నట్లు స్వయంగా ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు. ఉక్కుశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ కూడా ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టంగా ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. కళ్ళముందే ఇంత జరుగుతున్నా వైజాగ్ స్టీల్స్ ప్రైవేటుపరం కాదంటు వీర్రాజు చెప్పటం జనాల చెవిలో పువ్వులు పెట్టడం తప్ప మరోటికాదు.