క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనుమానంగా ఉంది. తెలుగురాష్ట్రాల మధ్య జల వివాదాలు పెరిగిపోతున్న సమయంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలనే డిమాండ్ పెరిగిపోతోంది. ప్రస్తుత సమస్యపై అఖిలపక్ష సమావేశం పెట్టడం ప్రభుత్వానికే మంచిది. అఖిలపక్ష సమావేశంపెట్టి వాస్తవాలను వివరించటం, మద్దతు కూడగట్టడం అధికారపార్టీకి చాలా అవసరం.
రాష్ట్రంలో సమస్యలు వచ్చినపుడు రాజకీయపార్టీల్లో ఎవరిది పై చేయి అనే విషయాన్ని తేల్చుకోవచ్చు. కానీ పొరుగు రాష్ట్రంతో అదీ కావాలనే వివాదం మొదలై పెరిగిపోతున్న సమయంలో పార్టీలన్నింటితో సమావేశం పెట్టడం విజ్ఞత అనిపించుకుంటుంది. పార్టీలు కలిసి వస్తాయా ? రావా ? అన్నది వేరే విషయం. అన్నీ పార్టీలను పిలిచి సమావేశం పెట్టి ప్రభుత్వం తన వాదనను వినిపించాలి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించాలి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఎన్ని డిమాండ్లు వచ్చినా అఖిలపక్ష సమావేశం పెట్టలేదన్న విషయం తెలిసిందే. ప్రత్యేకహోదా, ప్యాకేజీ విషయంలో చాలాసార్లు పిల్లిమొగ్గలు వేశారే కానీ అఖిలపక్ష సమావేశం మాత్రం పెట్టలేదు. పైగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదని చెప్పారు. అయితే అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పునే ఇపుడు జగన్ కూడా చేయాల్సిన అవసరంలేదు.
అఖిలపక్ష సమావేశం నిర్వహించటం అన్నది ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి వివిధ పార్టీల నేతలందరినీ పిలిచి సమావేశం పెట్టడమన్నది కనీస ధర్మం. అఖిలపక్ష నేతలను జగన్ ఢిల్లీకి తీసుకెళతారా లేదా అన్నది వేరే విషయం. ముందయితే అందరితో సమావేశం నిర్వహించాలి. ఇప్పటికే ఆలస్యమైందన్న విషయం గుర్తించాలి. కాబట్టి ప్రిస్టేజికి పోకుండా వెంటనే అఖిలపక్ష సమావేశం పెడితేనే విజ్ఞత అనిపించుకుంటుంది.