ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. సగటుజీవి బతుకు బండి దారుణంగా దెబ్బ తిన్న వేళ.. రేపేం చేయాలన్న వేదనలో మునిగిపోయిన వారికి ఊరటనిచ్చేలా.. మధ్యతరగతి జీవి మనోవ్యధకు కాస్త ఉపశమనం కలిగించేలా కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కారు.
ఈ మధ్యనే రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లుగా కేంద్రం గొప్పలు చెప్పినప్పటికీ సామాన్యుడికి నేరుగా కలిగిన ప్రయోజనం శూన్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ.. సగటు జీవికి నేరుగా ప్రయోజనం కలిగేలా.. కాసింత ఉపశమనం ఇచ్చేలా కీలక ప్రకటనను చేసింది భారత రిజర్వు బ్యాంకు. తాజాగా ద్రవ్యపరపతి సమీక్ష తర్వాత ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా ముందుకు వచ్చారు. రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడటం ఇదే తొలిసారి.
తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైనది రెపోరేటును 4.40 శాతం నుంచి 4 శాతానికి తగ్గించటం.. రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్ల తేడాతో ఆరుగురు సభ్యులున్న కమిటీ ఆమోదించినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమలకు కొంతమేర ఉపశమనం కలిగించే వీలుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. టర్మ్ లోన్ల మీద ఇప్పటికే మూడు నెలల మారిటోరియంనుఅమలు చేసిన బ్యాంకులకు.. మరో మూడు నెలల పాటు ఇదే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జూన్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకూ అన్ని టర్మ్ లోన్ల మీద మారిటోరియాన్ని పొడిగిస్తారు. దీంతో.. ఇంటి ఈఎంఐలు.. వాహన ఈఎంఐలతో పాటు.. అన్ని రకాల లోన్ల మీద బ్యాంకులు మారిటోరియంను అమలు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోవాలనుకునే వారు తప్పనిసరిగా.. బ్యాంకులకు రిక్వెస్టులు పెట్టుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. రెపోరేట్ తగ్గింపు కారణంగా రుణాల మీద వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates