అధికార వైసీపీ నేతలకు పెద్ద చిక్కే వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలపై సీఎం జగన్ నిఘా పెట్టారు. ఇప్పటికే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో నేతలు ఏం చేస్తున్నారు ? ఎలా ఉన్నారు ? అనే విషయాలపై ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనికి వలంటీర్ వ్యవస్థనే వాడుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వలంటీర్లు సేకరించిన సమాచారం.. తాడేపల్లికి చేరిపోయింది. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తమ్ముళ్లు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
మరికొన్ని నియోజకవర్గాల్లో మంత్రుల తనయులు, ఎమ్మెల్యేల తనయులు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారని.. నివేదికలు స్పస్టం చేస్తున్నాయని.. వైసీపీలో గుసగుస వినిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే సోదరుడు.. రెచ్చిపోతున్నారని.. నియోజకవర్గంలో ఏ పనిచేయాలన్నా కప్పం కట్టాల్సిందేనని పట్టుబడుతున్నారని తెలిసింది. ఇక, నెల్లూరులో ఓ సీనియర్ ఎంపీ.. తనయులు.. కూడా ఇదే తరహాలో రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఇక, అనంతపురం, కర్నూలు లో కూడా మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యేల కుటుంబాలు.. ఇదే తరహాలో రెచ్చిపోతున్నాయనే నివేదికలు స్పష్టం చేస్తున్నాయిట.
అయితే.. ఇవన్నీ. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని.. వారికి తెలియకుండా ఏదీ జరగదని.. కీలక సలహాదారు ఒకరు సీఎం జగన్ కు చెప్పినట్టు సమాచారం. అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారని… తద్వారా.. ప్రజల్లో మంచి సందేశాలకన్నా.. ఇవే ఎక్కువగా వెళ్తున్నాయని.. జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని, త్వరలోనే వీరికి క్లాస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు.
వీరిలో జగన్‌కు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులోనూ తమకు మంత్రి పదవులు ఖాయమనే భావనతో ఉన్నవారి పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి చివరికి వీరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates