ఎదురుదాడికి ఇండియా రెడీ అయిపోయిందా ?

ఇజ్రాయెల్ సంస్ధ చేసిన తాజా ప్రకటనతో అందరికీ ఇదే అనిపిస్తోంది. ఇజ్రాయెల్ నుండి మనదేశం డ్రోన్ గార్డ్ వ్యవస్ధను కొనుగోలు చేసినట్లే సమాచారం. నమ్మకమైన భాగస్వామికి తాము డ్రోన్ గార్డ్ వ్యవస్ధ టెక్నాలజీని అమ్మినట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఏఐ) చేసిన ప్రకటనతో అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. చాలా సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య రక్షణ వ్యవస్ధల టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఏఐ యాజమాన్యం చేసిన తాజా ప్రకటన బట్టి ఇజ్రాయెల్ నుండి డ్రోన్ గార్డ్ వ్యవస్ధను కొనుగోలు చేసింది భారతే అని అర్ధమవుతోంది. భారత్-పాకిస్ధాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈమధ్యనే డ్రోన్ లతో జరిగిన దాడుల గురించి అందరికీ తెలిసిందే. టార్గెట్ ను రీచవటంలో డ్రోన్ లు ఫెయిలయ్యాయి కానీ లేకపోతే ఘోరమైన ప్రమాధం జరిగుండేదనటంలో సందేహంలేదు. ఒకవేళ డ్రోన్ లు గనుక టాగెట్ ను రీచయ్యుంటే సైనికుల ప్రాణాలతో పాటు వేలకోట్ల రూపాయల యుద్ధ విమానాలు, ఆయుధాలను కోల్పోవాల్సుండేది.

సరిహద్దులను దాటి డ్రోన్ లతో దాడులు చేయటం ఇదే మొదటిసారైనా ఆఖరిసారి మాత్రం కాబోదన్న విషయం అర్ధమైపోయింది. పైకి పాకిస్ధాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చర్యగానే కనిపిస్తున్నా తెరవెనుక డ్రాగన్ హస్తాన్ని కొట్టిపారేసేందుకు లేదు. ఇటు పాకిస్ధాన్ అటు చైనాతో మనకు వేలాది కిలోమీటర్ల సరిహద్దులున్నాయి. వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో సైనికులు 24 గంటలూ కాపలా కాయటం అంత ఈజీకాదు. ఈ కారణంగానే పాకిస్ధాన్, చైనా అవకాశాలు తీసుకుని భరత్ లోకి చొరబాట్లతో పాటు దాడులు కూడా చేస్తున్నాయి.

తాజాగా పాకిస్ధాన్ వైపునుండి మొదలైన డ్రోన్ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవటం మనకు తలకుమించిన పనైపోయింది. అందుకనే ఇజ్రాయెల్ సాయం తీసుకున్నది. దానికి తగ్గట్లే ఆ దేశంకూడా షార్ట్, మీడియం, లాంగ్ రేంజిలో సమర్ధవంతంగా పనిచేయగల డ్రోన్ గార్డ్ టెక్నాలజీని అందించిందని సమాచారం. ఇజ్రాయెల్ అందించిన డ్రోన్ గార్డ్ టెక్నాలజీ మన సరిహద్దుల్లోని వాతావరణానికి సరిగ్గా సరిపోతుందని సైన్యాధికారులు సంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. కాబట్టి తొందరలోనే యాంటీ డ్రోన్ దాడులకు మన దగ్గరే డ్రోన్ రెడీఅయిపోవటం ఖాయం.