రాజకీయంగా అపర చాణిక్యుడు అనేపేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత.. చంద్రబాబు.. అనుసరిస్తున్న ఉదాశీన వైఖరితో .. పార్టీ ఇబ్బందుల్లో పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. గత ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతిన్న తర్వాత.. పలువురు నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. చాలా మంది నేతలు.. ఇతర పార్టీల్లో చేరారు. మరికొందరు తటస్థంగా మారారు. దీంతో నియోజకవర్గాల్లో పార్టీని పట్టించుకుని ముందుకు నడిపించే నేతలు కరువయ్యారు. అయితే.. కొన్నాళ్ల కిందట.. పార్టీ పార్లమెంటరీ.. జిల్లాల ఇంచార్జ్‌లను నియమించారు కదా?! అనే సందేహం రావొచ్చు.
కానీ, సదరు ఇంచార్జ్‌లు.. కేవలం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలను లీడ్ చేయలేక పోతున్నారు. ఈ క్రమంలో ఇంచార్జ్‌లు లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు. అనంతపురంలో రెండు నియోజకవర్గాలు, గుంటూరులో ఒకటి, కృష్ణాలో ఒక నియోజకవర్గం చొప్పున.. చంద్రబాబు కొత్త ఇంచార్జ్‌లను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అత్యంత కీలకమైన..వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో మాత్రం చంద్రబాబు ఉదాశీనంగా ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
వీటిలో సత్తెనపల్లి, పలాస, గన్నవరం నియోజకవర్గాలు ఉన్నాయి. సత్తెనపల్లిలో గత ఎన్నికల్లో మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాదరావు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత అనూహ్య కారణాల నేపథ్యంలో ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పార్టీని నడిపించేవారు లేరు. కోడెల కుమారుడు ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే.. అదే సమయంలో ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ సీనియర్ నాయకుడు, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు కూడా ఇదే స్థానం ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం లేదు.
కానీ, ఇలా ఎన్నాళ్లు తాత్సారం చేస్తారనేది ఇక్కడి కార్యకర్తల ప్రశ్న. మరో వైపు.. కృష్ణాజిల్లా గన్నవరం.. ఇక్కడ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి మద్దతుదారుగా మారారు. ఈ క్రమంలో ఇక్కడ కూడా ఇంచార్జ్ లేకుండా పోయారు. దీంతో తాత్కాలికంగా.. బచ్చుల అర్జునుడును నియమించినా.. ఆయన అనారోగ్య కారణంగా ఇక్కడ పర్యటించలేక పోతున్నారు. దీంతో ఇక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇంచార్జ్‌ను నియమించాల్సిన అవసరం ఉంది. కానీ, బాబు మాత్రం తాత్సారం చేస్తున్నారనేది ఇక్కడి నేతల ఆవేదన. ఇక, పలాసలో ఇంచార్జ్‌ను మార్చాలని. ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. జిల్లా బాధ్యతలు, పలాస నియోజకవర్గం బాధ్యతలు.. గౌతు శిరీషకే ఉండడంతో కొందరు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా.. పలు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చంద్రబాబు పరిష్కరిస్తేనే పార్టీకి ఊపు వస్తుందని.. అంటున్నారు సీనియర్లు.