హోరెత్తించేయనున్న రేవంత్

కొత్తగా నియమితులైన తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు తనదైన స్టైల్లో తొందరలోనే హోరెత్తించేందుకు పెద్ద ప్లాన్ వేస్తున్నారా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాచారం వస్తోంది. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావటం కోసం తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదాయాత్ర మొదలుపెట్టబోతున్నారట. గతంలో పాదయాత్రలు చేసిన దివంగత సీఎం వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి స్పూర్తితోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సమాచారం.

రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించటం పార్టీలోని కొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ నేతలకు అధిష్టానంతో పాటు జనాల్లో కూడా బలం అంతంతమాత్రమే. వాళ్ళకు చెప్పుకోతగ్గ బలం లేకపోయినా చెవిలో జోరిగల్లాగ 24 గంటలూ గోల చేస్తునే ఉంటారన్నది వాస్తవం. వీళ్ళే కాకుండా జనబలం ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు.

సో ఇలాంటి వ్యతిరేక నేతలను వదిలిపెట్టేసి తనతో కలిసివచ్చే నేతల మద్దతుతో ముందుకు సాగాలని రేవంత్ డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే పాదయాత్ర చేయటమే భేషైన మార్గంగా నిర్ణయించుకున్నారు. కేసీయార్ గద్దె దింపాలంటే గాంధీ భవన్లో కూర్చుంటే లాభం లేదన్న విషయం రేవంత్ కు బాగా తెలుసు. జనాల్లోకి వెళ్ళిపోయి మద్దతు కూడగట్టడం ఒకటే మార్గమని కొత్త అధ్యక్షుడు డిసైడయ్యారు.

అందుకనే 7వ తేదీన బాధ్యతలు తీసుకునే సందర్భంగా కానీ లేకపోతే తర్వాత కానీ తన పాదయాత్ర విషయాన్ని కొత్త అధ్యక్షుడు ప్రకటించబోతున్నారట. అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు అంటే మొత్తం 33 జిల్లాలు పాదయాత్రలో కవర్ అయ్యేట్లుగా రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగూ పాదయాత్రకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం ఖాయం. కాబట్టి ఎవరికిష్టమున్నా లేకపోయినా పాదయాత్రకు నేతలంతా మద్దతివ్వాల్సిందే. మొత్తానికి పాదయాత్రతో రేవంత్ తెలంగాణాను హోరెత్తించేందకు రెడీ అయిపోతున్నారు.