మెగా బ్రదర్ నాగబాబు ఓ అనవసర వివాదంలో వేలు పెట్టారు రెండు రోజుల కిందట. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గురించి ఆయన వేసిన పాజిటివ్ ట్వీట్లు కలకలం రేపాయి. గాంధీని చంపడం తప్పే అయినా.. గాడ్సే దేశభక్తిని మాత్రం శంకించలేమంటూ అతడి గురించి చాలా సానుకూలంగా మాట్లాడాడు నాగబాబు.
దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పెద్ద దుమారం రేగింది. ఈ ట్వీట్లు జనసేన మెడకు చుట్టుకున్నాయి. అసలే భాజపాతో జట్టు కట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కాషాయం పులిమేసుకుంటున్నాడన్న విమర్శలుండగా.. ఇప్పుడు నాగబాబు వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ల తరహాలో గాడ్సేను పొగడ్డంతో దుమారం రేగింది. నాగబాబు అవసరం లేని విషయంలో వేలు పెట్టి విమర్శలు కొని తెచ్చుకున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
చిరు, పవన్ రంగంలోకి దిగారో ఏమో తెలియదు కానీ.. నాగబాబు ఆల్రెడీ ఈ వ్యాఖ్యల విషయంలో వివరణ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతమని.. దీనికి జనసేనతో సంబంధం లేదని కూడా వివరించాడు. అయినా వివాదం సద్దుమణగలేదు. ఇప్పుడు ఏకంగా నాగబాబు మీద పోలీస్ కేసు నమోదయ్యే వరకు పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు.. గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాగబాబుపై కేసు నమోదు చేశారు.
గాంధీజీని ఆయన అగౌరవపరిచారంటూ ఓ కాంగ్రెస్ నాయకుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై నాగబాబు ఎలా స్పందిస్తారు.. కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయి.. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందన్నది చూడాలి. కచ్చితంగా నాగబాబు ఇప్పుడు తన వ్యాఖ్యల విషయంలో విచారిస్తూనే ఉంటారేమో. దీని వల్ల జనసేన పార్టీకి చాలానే నష్టం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates