నిమిషాల వ్యవధిలో మూడుసార్లు వ్యాక్సిన్..చివరకు..!

దేశంలో కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా నిర్వహిస్తారు. అయితే.. ఈ వ్యాక్సినేషన్ సమయంలో పలు చోట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళకు కేవలం నిమిషాల వ్యవధిలో.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రకు చెందిన ఓ 28ఏళ్ల మహిళ గత శుక్రవారం తన భర్తతో కలిసి స్థానిక టీకా కేంద్రానికి వెళ్లింది. అక్కడ ఆమెకు మూడు డోసుల వ్యాక్సిన్ ఇచ్చారు. టీకా వేయించుకున్న తర్వాత.. తనకు నర్స్.. మూడు సార్లు వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె తన భర్తతో చెప్పింది. దీంతో.. అది చాలా ప్రమాదం అని భావించిన ఆమె భర్త అధికారులకు ఫిర్యాదు చేశాడు.

అతను థానే మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తుండటంతో.. వెంటనే ఈ విషయాన్ని తన పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. తన భార్య ఈ వ్యాక్సిన్ విషయంలో అవగాహన లేదని.. అందుకే.. నర్స్ మూడుసార్లు వ్యాక్సిన్ ఇవ్వడంతో తీసుకుందని అతను వాపోయాడు.

మూడు డోస్ ల వ్యాక్సిన్ తో ఆమెకు విపరీతమైన జ్వరం వచ్చిందని అతను చెప్పాడు. ఈ విషయం కాస్త సంబంధిత మెడికల్ అధికారులకు తెలియడంతో.. ఆమెను పరీక్షించారు. అయితే.. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని గుర్తించారు. అయితే.. రెండు, మూడు రోజుల తర్వాత ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచినట్లు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని వారు మండిపడ్డారు.