రేవంత్ రెడ్డికి మేయర్ స్పెషల్ విషెస్.. ఫోటోలు వైరల్..!

టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి కి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపడం కాదు.. స్వయంగా పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్పెషల్ గా విషెస్ తెలియజేయడం ఇక్కడ విశేషం.

ఆమె అలా శుభాకాంక్షలు తెలియడం పట్ల అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. విజయలక్ష్మీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి.. మేయర్ గా గెలుపొందారు. ఆమె.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలుపొందిన ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా… ఆయన మంగళవారం జరిగిన కౌన్సిల్ వరచ్చువల్ మీటింగ్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి వచ్చారు.

కార్పొరేటర్ గా ధర్పల్లి రాజశేఖర్ రెడ్డితో ప్రమాణం చేయించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.. అనంతరం పీసీసీ చీఫ్ గా నియమితులైన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ మీటింగ్ కు ఆన్ లైన్ లో హాజరు కావాల్సి ఉండగా… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కార్పొరేటర్ శేఖర్ రెడ్డి నేరుగా వర్చువల్ సమావేశం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కి రావడం గమనార్హం.