రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఏదో ఒక కారణం చూపించి ఇమేజ్ డ్యామేజ్ చేయటం కనిపిస్తుంది. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. రివ్యూ మీటింగ్ వేళ.. ఆయన తీరు ఇలా ఉంటుందా? అని సామాన్య ప్రజానీకం అనుకునేలా రాసే రాతలపై తాజాగా ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన ఒక కాలమ్ లో సీఎం జగన్ గురించి రాసిన రాతల్ని.. అధికారులు జగన్మోహన్ రెడ్డికి చూపించారు. అందులో.. ఆయన్ను చులకన చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయి.
అందులోని అంశాల మీద చర్చ సాగింది. తాను కొవిడ్ రివ్యూ చేసే సందర్భంగా అధికారుల ఎదుట కరోనా తీవ్రతను చులకన చేసేలా మాట్లాడినట్లుగా పేర్కొన్నారని మండిపడ్డారు. అంతేకాదు.. అర్థరాత్రి జీసస్ తో సంభాషించినట్ులగా ఉద్దేశపూర్వకంగా రాసినట్లుగా పేర్కొని సదరు మీడియా సంస్థ తీరును తప్పు పట్టారు.
“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా గత ఏడాది ప్రారంభంలో ఇలాగే చులకనగా మాట్లాడారు. కరోనా వైరస్‌లేదు.. ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్‌లేదు.. భయపడవద్దు అని జీసస్ చెప్పారు. అని జగన్‌రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు” అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని అధికారులు సీఎం జగన్ కు చూపించారు. దీనిపై ఆయన స్పందించారు.
“అసలు ఎవరైనా ఇలాంటి రాతలు ఎలా రాయగలుగుతారు? ఇలాంటి రాతల ద్వారా ముఖ్యమంత్రి పదవికి విలువ తగ్గించి.. దాన్ని అథమస్థాయిలోకి తీసుకెళుతున్నారు. చేతిలో ఒక పత్రిక.. ఒక టీవీ ఉందని ఇలాంటి రాతలు రాయటమేనా? కొవిడ్ నివారణా చర్యలపై ఇంత సీరియస్ గా సమీక్షలు చేస్తుంటే.. వాటిని అపహాస్యం చేసేలా ఇలాంటి రాతలు రాయటం అత్యంత దురదృష్టకరం. ఇంతమంది అదికారులకు టైం పాస్ కాక రివ్యూలకు హాజరవుతున్నారా? ఈ వార్తలు రాసే వారికి కనీసం ఎక్కడో చోటైనా విలువలు ఉండాలి కదా? ఏది రాయాలనిపిస్తే అలా రాసేస్తారా?” అంటూ సీరియస్ అయ్యారు. ఈ తరహా రాతలపై చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ కు అధికారులు స్పష్టం చేయటం గమనార్హం. మరి.. చర్యల పరంపర ఎప్పటికి షురూ అవుతోందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates