‘ఎస్సీ’కు ద‌గ్గ‌ర‌గా కేసీఆర్‌.. విప‌క్షాల వ్యూహాల‌కు బ్రేకులు

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు ఏ అవ‌కాశం ఉన్నా.. స‌ద్వినియోగం చేసుకోవ‌డం అనేది అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ కొన్నాళ్లుగా ప్ర‌తిప‌క్షాలు.. ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను అణ‌గ‌దొక్కా ల‌నే ల‌క్ష్యంతో పాటు.. కేసీఆర్‌పై పైచేయి సాధించేందుకు నేత‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని టీఆర్ ఎస్‌కు దూరం చేయ‌డం అనేది ఇటీవ‌ల కాలంలో పార్టీలు చేస్తున్న ప్ర‌ధాన ప్ర‌య‌త్నం. కొన్నాళ్ల కింద‌ట ఎస్సీ భూముల‌ను క‌బ్జా చేస్తున్నారంటూ.. కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. ఇక‌, ఎస్సీని ముఖ్య‌మంత్రిని చేస్తానంటూ.. కేసీఆర్ మాటిచ్చి త‌ప్పార‌ని.. బీజేపీ కూడా విమ‌ర్శ‌లు కొన‌సాగిస్తోంది.

దీనికితోడు.. ఇటీవ‌ల కాలంలో ఎస్సీల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని.. కేవ‌లం వారిని ఓటు బ్యాంకుకోస‌మే కేసీఆర్ వినియోగించు కుంటున్నార‌ని.. ఉద్యమ నేత‌లు.. కోదండ‌రామ్‌.. క‌త్తి ప‌ద్మారావు వంటివారు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత‌.. సీనియ‌ర్ నాయ‌కుడు.. వివేక్ కూడా సీఎంపై ఎస్సీ కోణంలోనే విమ‌ర్శ‌లు సంధించారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని కేసీఆర్‌కు దూరం చేయాల‌నే ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ విష‌యాన్ని సీఎం కేసీఆర్ ముందుగానే అంచ‌నా వేసిన‌ట్టు తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి అంచ‌నా వేస్తున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్సీ వ‌ర్గాన్ని చేజార్చుకోకుండా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ఇటీవ‌ల ఆయ‌న వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు.. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌ల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నా లు చేశారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం ఎస్సీ వ‌ర్గాల‌కు క‌ల్పిస్తున్న సంక్షేమాన్ని ఆయ‌న వివ‌రించారు. మంత్రి వ‌ర్గంలో ఎస్సీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ ఎవ‌రెవ‌రికి.. అవ‌కాశం క‌ల్పించారో కూడా ఆయ‌న ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేసీఆర్ ఎస్సీ సామాజిక వ‌ర్గాన్ని దూరం చేసుకోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని అప్ప‌ట్లోనే చ‌ర్చ‌లు న‌డిచాయి. ఇక‌, ఇప్పుడు తాజాగా లాక‌ప్‌డెత్ కు గురైన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ కుటుంబానికి అనూహ్య సాయం ప్ర‌క‌టించారు.

అదేస‌మ‌యంలో ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌కు అడిగిందే త‌డ‌వుగా.. అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. ఇలా.. కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు.. ప్ర‌తిప‌క్షాల ఎస్సీ రాజ‌కీయాల దూకుడుకు బ్రేకులు వేస్తున్న‌ట్టేన ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మాజీ డిప్యూటీ సీఎంలు రాజ‌య్య‌, క‌డియం శ్రీహ‌రిల‌కు కూడా ప్రాధాన్యం పెంచేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. వీరు కూడా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే.. మొత్తంగా చూస్తే.. ప్ర‌తిప‌క్షాల వేస్తున్న అడుగులు పుంజుకోక ముందే.. కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.