ప్రముఖ టాలీవుడ్ నటుడు ఆర్ నారాయణ మూర్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లోని ఛలో రాజ్ భవన్ అనే కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో ఆర్ నారాయణమూర్తి పాల్గొన్నారు .
రాజ్ భవన్ కు వెళ్లడానికి రైతుల వద్ద అనుమతి లేనందున పోలీసులు వారిని అడ్డుకున్నారు. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు వారించగా.. రైతులు నిరాకరించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అరెస్ట్ అయిన వారిలో నటుడు ఆర్ నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతమాత్రం ప్రయోజనకరంగా లేవని అన్నారు.
2006వ సంవత్సరంలో బీహార్ లో కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చారు. ఆ చట్టాల కారణంగా అక్కడ రైతులు అనేవారు లేకుండా పోయారని.. రైతులు కూలీలుగా మారారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఇక్కడ కూడా అదే పరిస్థితి చోటుచేసుకుంటుందని.. కాబట్టి ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యాన్ని ప్రయివేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు.