తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మాట మంటలు రేగుతున్నాయి. భీషణ ప్రతిజ్ఞలు తెరమీదికి వస్తున్నాయి! మరి ఇవన్నీ.. మున్ముందు కూడా కొనసాగుతాయా? లేక.. టీకప్పులో తుఫాను మాదిరిగా సమసిపోతాయా? ఇదీ.. ఇప్పుడు.. ప్రధాన ప్రశ్న. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా.. నూతనంగా నియమితులైన.. రేవంత్ రెడ్డి కేంద్రంగా కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పైకి ఏమీ అనకపోయినా.. లోలోన మథన పడుతున్నవారు.. పైకి వెళ్లగక్కుతున్నవారు.. ఇలా సీనియర్లు.. తమ కడుపులో ఆవేదనను బయటకు వెళ్లగక్కుతున్నారు.
కేవలం 2018లో కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డికి.. కొన్ని దశాబ్దాలుగా పార్టీలో పాతుకుపోయిన తమకు తేడాను గుర్తించడంలో పార్టీ అధిష్టానం విఫలమైందని.. సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి బయటపడిపోయారు. ఇక, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరింత దూకుడుతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనని, టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దని కుండబద్దలు కొట్టారు. అది టీపీసీసీ కాదని, టీడీపీ పీసీసీగా మారిందని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని విమర్శించారు. మరోనేత.. వీహెచ్.. రేవంత్ ఎంపకకు ముందుగానే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు ఏం తెలుసునని.. పార్టీ పగ్గాలు ఇస్తారు. ఇలా అయితే.. నే కాంగ్రెస్‌లో ఉండ
-అని వ్యాఖ్యానించిన హనుమంతన్న.. ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నారో.. లేక మరేం చేస్తారో తెలియదు. అదేవిధంగా భట్టి విక్రమార్క, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీ. శ్రీధర్‌బాబు.. ఇలా అనేక మంది నాయకులు.. పీకలదాకా కోపంతో ఉన్నారు. కట్ చేస్తే.. వీరంతా ఏం చేస్తారు? పార్టీని వదిలేస్తారా? పొరుగు పార్టీలతో జతకడతారా? అంటే.. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి చర్యలకు ఒడిగట్టేది లేదని స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే.. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ముడిపడి ఉన్న రాజకీయాలు ఒక రీజన్ అయితే.. ఇతర పార్టీల్లోనూ సరైన పదవులు కనిపించడం లేదు. వెళ్తే.. బీజేపీలోకి వెళ్లాలి.. అనే మాట వినిపిస్తున్నా… ఆ సాహసం ఈ నేతలు చేసే పరిస్థితి కనిపించదు. పైకి విమర్శలు.. విసుర్లు.. కనిపిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు.. అధిష్టానం.. నుంచి దూత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలోని సీనియర్లను సర్దుబాటు చేసేందుకు, రేవంత్‌తో కలిసి ముందుకు సాగేలా చేసేందుకు అధిష్టానం త్వరలోనే ఓ సీనియర్‌ను దూతగా పంపనున్నట్టు.. ఢిల్లీలో తెలంగాణ రాజకీయాలపై అవగాహన ఉన్న కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సో.. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు… టీ కప్పులో తుఫానేనని అంటున్నారు.