సీఎం కేసీఆర్ ఇటీవల తన దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటించి… గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన సంగతి తెలిసిందే. కాగా… సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన గ్రామస్థుల్లో దాదాపు 18మంది అస్వస్థతకు గురవ్వడం గమనార్హం.
కేసీఆర్ పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్ధురాలు ఆకుల ఆగమ్మ తొలుత అస్వస్థతకు గురకావడంతో ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. తర్వాత ఆగమ్మ కోలుకోవడంతో వైద్యులు ఆమెను గురువారం డిశ్చార్జ్ చేశారు.
బుధవారం ఒక బాలిక అస్వస్థతకు గురి కావటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం అదే రోజు ఇంటికి పంపారు. అయితే, ఆ గ్రామంలో మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యాధికారి సీహెచ్.చంద్రారెడ్డి తెలిపారు.
వారి అస్వస్థతకు ఆహారం కలుషితం కావడం కారణం కాదని, సహపంక్తి భోజనంలో 2,500 మంది పాల్గొనగా.. 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్లు వివరించారు. తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలై ఉంటాయని చెప్పారు. తొలుత ఆగమ్మ సభ పూర్తయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. రాత్రి మరోసారి వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
జూన్ 22న సీఎం కేసీఆర్ పక్కనే కూర్చుని ఆగవ్వ భోజనం చేశారు. వాసాలమర్రి గ్రామంలో ఆగవ్వ తనకు దోస్త్ అయిందని ప్రకటించారు. మొత్తం ముగ్గురు దోస్తుల్లో ఆకుల ఆగవ్వ కూడా ఒకరని అన్నారు. తనకు ఊర్లో ఫ్రెండు ఆగవ్వ ఒకరే ఉన్నారని, మొత్తం ఊరంతా దోస్తులు కావాలని కేసీఆర్ కోరారు.