సుప్రీం సీరియ‌స్‌.. దిగొచ్చిన జ‌గ‌న్‌.. ప‌రీక్ష‌లు ర‌ద్దు

  • ప‌రీక్ష‌లు నిర్వ‌హించే తీరుతాం.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాం – ప్ర‌భుత్వం
  • థ‌ర్డ్ వేవ్ క‌రోనాతో ఏ ఒక్క విద్యార్థి చ‌నిపోయినా.. కోటి రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి- సుప్రీం కోర్టు

క‌ట్ చేస్తే..
జ‌గ‌న్ స‌ర్కారు వెన‌క్కి త‌గ్గింది. సుప్రీం హెచ్చ‌రిక‌లు, ఆదేశాలతో విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం వ‌చ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆగ్రహంతో జ‌గ‌న్‌ ప్రభుత్వం దిగొచ్చింది. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ తేల్చి చెప్పారు. మ‌రోవైపు కొన్నాళ్లుగా.. కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విష‌యంలో టీడీపీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ విద్యార్థుల త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించారు.

ఇది కూడా రాష్ట్ర స‌ర్కారు వెన‌క్కి త‌గ్గ‌డానికి కార‌ణ‌మైంది. మరోవైపు ఇప్పటికే 21 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడింది. దీంతో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 15 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగిన‌ట్ట‌యింది.