జగన్ చనిపోయింది నిజమేనా ?

పోలీసులు చేసిన ప్రకటన నిజమే అయితే మావోయిస్టులకు పెద్ద దెబ్బ అనే అనుకోవాలి. మావోయిస్టు కేంద్రకమిటి సభ్యుడు, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరినారాయణ అలియాస్ జగన్ మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. కొద్దిరోజులుగా కోవిడ్ తో బాధపడుతున్న జగన్ సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించినట్లు బస్తర్ జిల్లా అడవుల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది.

జగన్ మృతి వార్త వాస్తవమేనని దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ కూడా ధృవీకరించారు. ఇదే సందర్భంగా జగన్ మరణించింది నిజమే అంటు బస్తర్ ఐజీ పి. సుందర్ రాజు కూడా ప్రకటించారు. అయితే జగన్ మృతికి సంబంధించిన మావోయిస్టుపార్టీ నుండి ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా రాలేదు. గతంలో నాలుగుసార్లు వివిధ సందర్భాల్లో ఈ అగ్రనేత మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే అప్పట్లో వెంటనే పోలీసుల ప్రకటన తప్పంటు స్వయంగా జగనే ఖండనలు జారీచేశారు. కాబట్టి అప్పట్లో జగన్ బతికే ఉన్నాడన్న విషయం అర్ధమైంది.

అయితే ఇప్పటి పరిస్ధితి వేరు. ఎందుకంటే బస్తర్, దంతేవాడ అటవీ ప్రాంతాల్లో జనాల్లోనే జగన్ చనిపోయిన విషయమై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దాన్నిబట్టే పోలీసులు కూడా ప్రకటించారు. పోలీసుల ప్రకటనపై మావోయిస్టుల నుండి ఇంతవరకు ఖండన రాలేదు కాబట్టి జగన్ చనిపోయింది నిజమే అనుకుంటున్నారు. అయితే సుక్మా అటవీప్రాంతంలో విషపూరితమైన ఆహారం తీసుకోవటం వల్లే జగన్ మరణించారనే ప్రచారం కూడా ఉంది.

కరోనానా లేకపోతే విషపూరితమైన ఆహారం వల్ల చనిపోయినా మొత్తానికి చనిపోయింది అయితే వాస్తవమే అన్న ప్రచారం అయితే పెరిగిపోతోంది. మావోయిస్టుల తరపునుండి కూడా ఎలాంటి ఖండనలు లేకపోవటంతో చనిపోయిందే నిజమనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకవేళ జగన్ చనిపోయిందే నిజమైతే మాత్రం మావోయిస్టులకు పెద్ద దెబ్బనే చెప్పాలి.

ఎందుకంటే గెరిల్లా పోరాటాలు చేయటంలో, పోలీసులకు వ్యతిరేకంగా వ్యూహాలు రచించటంలోను జగన్ చాలా ఎక్స్ పర్టనే చెప్పాలి. గతంలో జగన్ ఆధ్వర్యంలోనే పోలీసులపై మావోయిస్టులు ఎన్నో దాడులు జరిపారు. ఇదే సమయంలో పోలీసుల ఎన్ కౌంటర్లలో కూడా జగన్ తృటిలో చాలాసార్లు తప్పించుకున్నారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే 37 ఏళ్ళ మావోయిస్టు ప్రస్ధానంలో జగన్ ప్రయాణం ఆగిపోయినట్లే అనుకోవాలి.