రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఎక్కడ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది ? అంటే.. ఠక్కున చెప్పే మాట… ఉత్తరాంధ్ర. జనసేన రాజకీయాలు ఎక్కువగా.. ఉత్తరాంధ్రలోనే కొనసాగాయి. పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించి.. ప్రజల మధ్య ప్రసంగాలు గుప్పించారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చంద్రబాబు హయాంలోనే ఆయన ఎలుగెత్తారు. తర్వాత.. 2019 ఎన్నికలకు ముందు కూడా నెలల తరబడి.. ఆ జిల్లాల్లోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. దీంతో కోస్తా… సీమ ప్రాంతాల కంటే.. కూడా ఉత్తరాంధ్రలో జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడతారని అందరూ అనుకున్నారు.
కానీ, గత ఎన్నికల్లో జనసేనకు ఉత్తరాంధ్రలో ఆశించిన విధంగా ఓట్లు పడలేదు. పైగా.. పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసిన విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలోనే ఆయన ఓడిపోయారు. వాస్తవానికి ఏపీ మొత్తంలో ఒక్క నియోజకవర్గంలోనే జనసేన విజయం దక్కించుకుంది. కీలకమైన విశాఖ ఎంపీ సీటులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గెలుస్తారని అందరూ అనుకుంటే ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఎన్నికలు అయ్యి రెండేళ్లయ్యింది. సరే ఉత్తరాంధ్రలో పవన్ ప్రాణాలు పెట్టుకుని మరీ ఇక్కడి ప్రజల సమస్యలపై పోరాటం చేశారు కదా.. మరి ఇక్కడ ఇప్పుడు పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అనేది కీలక ప్రశ్న.
వాస్తవానికి మిగిలిన రెండు ప్రాంతాలైన కోస్తాంధ్ర, రాయలసీమలతో పోల్చుకుంటే.. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. కోస్తాంధ్రలో కనీసం వాయిస్ వినిపించేందుకు నాయకులు ఉన్నారు. జెండా పట్టుకునేందుకు కార్యకర్తలైనా ఉన్నారు. మరీ ముఖ్యంగా పోతుల మహేష్ వంటి వారు.. కోస్తాలో పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నారు. కానీ, ఉత్తరాంధ్ర విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ వీడిపోయారు.
ఇక, ఇతర నేతలు కూడా పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కీలకమైన శ్రీకాకుళంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరూ ముందుకు రావడంలేదు.. పార్టీ వాయిస్ వినిపించడం లేదు. దీంతో ఉత్తరాంధ్రలో జనసేన ఉన్నట్టా? లేనట్టా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పుంజుకుంటేనే పార్టీ… లేకపోతే.. లేనట్టే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates