ఏపీ వ్యాక్సినేష‌న్ రికార్డు… అసలు కథ ఇదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒకే రోజు ప‌ది ల‌క్ష‌ల‌కు పైగా వ్యాక్సిన్లు.. ఆదివారం కొన్ని టీవీ ఛానెళ్లు, వెబ్ సైట్లు.. అలాగే సోష‌ల్ మీడియాలో హోరెత్తిన వార్త ఇది. స‌రిగ్గా చెప్పాలంటే ఆదివారం ఏపీలో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య 13,26,271. ఒక్క రోజులో ఒక రాష్ట్రం ఇన్ని వ్యాక్సిన్లు వేయ‌డం రికార్డ‌ట‌. దీని గురించి జ‌గ‌న్ స‌ర్కారు మ‌ద్ద‌తుదారులు గొప్ప‌గా చెప్పుకుంటున్నారు.

సోష‌ల్ మీడియాలో దీనిపై హోరెత్తించేస్తున్నారు. కానీ ఇలా రికార్డ్ నెల‌కొల్ప‌డం వెనుక ఓ వైఫ‌ల్యం కూడా ఉంది. గ‌త కొన్ని రోజుల నుంచి ఏపీలో వ్యాక్సినేష‌న్ చాలా త‌క్కువ‌గా జ‌రుగుతోంది. ఆదివారం రికార్డు నెల‌కొల్ప‌డం కోసం దానికి ముందు వారం పాటు రోజు వారీ వ్యాక్సినేష‌న్ బాగా త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది. కొవిన్ యాప్‌లో డేటాను ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలిసిపోతోంది.

ఆదివారానికి ముందు నాలుగు రోజులు క‌లిపి ఏపీలో వేసిన వ్యాక్సిన్లు క‌నీసం ల‌క్ష కూడా లేవు. మొత్తంగా 90 వేల లోపే వ్యాక్సిన్లు వేశారు. కానీ ఆదివారం మాత్రం అనూహ్య స్థాయిలో వ్యాక్సినేష‌న్ జ‌రిగింది. వివిధ జిల్లాల్లో ఒక్క‌సారిగా వ్యాక్సినేష‌న్ ఊపందుకుంది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ఆదివారం ల‌క్షా 40 వేల దాకా వ్యాక్సిన్లు వేయ‌డం విశేషం. ఐతే గ‌త వారం రోజుల్లో రాష్ట్రానికి స‌రిప‌డా వ్యాక్సిన్లు రాక వ్యాక్సినేష‌న్ అంత త‌క్కువ‌గా జ‌రిగిందా.. లేక అప్పుడు కావాల‌నే వ్యాక్సిన్లు త‌గ్గించి వేసి, ఆదివారం రికార్డు కూడా ఆపారా అన్న‌ది తెలియ‌డం లేదు.

ఇలా ఒక్క రోజులో 13 ల‌క్ష‌ల వ్యాక్సిన్ల‌తో రికార్డు నెల‌కొల్ప‌డం ద్వారా ఏం సాధిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఒక్క రోజు దేశం మొత్తం ఇటు చూస్తే స‌రిపోతుందా? ముందు రోజుల్లో అంత త‌క్కువ‌గా వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డం గురించి ప్ర‌శ్న‌లు త‌లెత్తితే అది త‌మ‌కు ఇబ్బంద‌ని ప్ర‌భుత్వం ఆలోచించ‌క‌పోవ‌డ‌మేంటో?

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)