“మా కొద్దీ..పరీక్షలు.. కరోనాతో అల్లాడిపోతున్నా.. పరీక్షలేంటి?” “మా పిల్లలకుచదువులు ముఖ్యమే.. అంతకన్నా.. వారి ప్రాణాలూ ముఖ్యమే. ప్రభుత్వం ఆలోచించాలి!”
ఇదీ.. చదువులు-పరీక్షలపై ఏపీలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు.. కొన్నాళ్లుగా చేస్తున్న వ్యాఖ్యలు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏకంగా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వర్చువల్ భేటీలు నిర్వహించి.. వారి అభిప్రాయాలు కూడా సేకరించారు. ఈ సందర్భంగా తమకు పిల్లల ప్రాణాలే ముఖ్యమని తల్లిదండ్రులు.. ముక్తకంఠంతో పేర్కొన్నారు.
అయితే.. సీఎం జగన్ సర్కారు మాత్రం ఎవరు ఏమనుకున్నా.. ఎవరు ఎంత బాధపడినా బేఖాతర్ చేస్తోంద నే వాదన బలంగా వినిపిస్తోంది. పరీక్షలు నిర్వహించే తీరుతామని.. ప్రకటిస్తూ.. వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్నట్టే.. సర్కారు పంతాన్ని నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నారు. తాజాగా ఆయన ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ -2021 పరీక్షలకు సంబంధించి మంత్రి సురేష్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు మంత్రి చెప్పారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని మంత్రి వివరించారు.
అంటే.. మొత్తంగా కరోనా పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రజలు అల్లాడుతున్నా.. మరణాలు కొనసాగుతున్నా.. సర్కారు తమ ఇష్టానుసారమే వ్యవహరిస్తుండడం.. పంతానికి పోతుండడం గమనార్హం. నిజానికి సీబీఎస్ఈ సహా అనేక పరీక్షలను రద్దు చేయాలని.. సుప్రీం కోర్టు ఆదేశించిన మూడు రోజులు కూడా గడవకముందే.. ఏపీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తూ.. ఎంసెట్‌కు సంబంధించి ప్రకటన చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుండడం గమనార్హం.