షాకింగ్ రిపోర్టు: ప్రపంచ వ్యాప్తంగా కోట్ల ఉద్యోగాలు ఫట్

కంటికి కనిపించని కరోనా వైరస్ కారణంగా ఆ దేశం.. ఈ దేశం అన్నది తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితమైన సంగతి తెలిసిందే. సంపన్న దేశాల్లోనూ ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరోనాను వెనువెంటనే కంట్రోల్ చేయాలని.. లేని పక్షంలో ప్రపంచవ్యాప్తంగా  కోట్లాది కొలువులు పోవటం ఖాయమన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కరోనాను కంట్రోల్ చేసేందుకు వివిధ దేశాలు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటిస్తున్నాయి. దీంతో ఉత్పాదకత పడిపోవటమే కాదు.. వివిధ దేశాల్లోని పలు సంస్థలు తమ వ్యాపారాల్ని నిర్వహించలేక ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఎప్పుడూ సింగిల్ డిజిట్ దాటని అమెరికా.. యూరప్ లలో నిరుద్యోగ రేటు డబుల్ డిజిట్ కు చేరుకోవటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు.

ఇదిలా ఉంటే..కరోనా కారణంగా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక నివేదికను సిద్ధం చేసింది. ఇందులో పలు షాకింగ్ అంశాలు చోటు చేసుకున్నాయి. కరోనా చెలరేగిపోతున్న వేళ.. దాదాపు ఏడు లక్షల మంది ఉద్యోగాల్ని కోల్పోయినట్లుగా గుర్తించారు. వాస్తవానికి ఆర్థిక నిపుణులు లెక్క వేసిన దాని కంటే ఈ గణాంకాలు ఏడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇప్పటివరకూ ఎప్పుడు లేనంతగా ఆస్ట్రియాలో నిరుద్యోగం పన్నెండు శాతానికి చేరుకుంది. సంపన్న దేశాల్లో ఒకటిగా చెప్పే జర్మనీలో కరోనా ముందు వరకూ చేసే పనికి గంటల చొప్పున వేతనాన్ని ఇచ్చేవారు. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కంపెనీలు ఉద్యోగుల పని గంటల్ని రికార్డు స్థాయిలో తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో 4.7 లక్షల కంపెనీలు జర్మనీ ప్రభుత్వాన్ని వేతన సాయానికి అప్లై చేసుకోవటం విశేషం.

వారం వ్యవధిలో బ్రిటన్ లో 27 శాతం సిబ్బందిని తగ్గించారు. గడిచిన రెండు వారాల్లో యూరప్ లో పది లక్షల మంది తమకు బతుకు గడవటమే కష్టంగా ఉన్నట్లుగా పేర్కొంటూ ప్రభుత్వ సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పద్నాలుగు శాతం నిరుద్యోగం నమోదైంది. స్పెయిన్ లో ఉద్యోగాలుకోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఫ్రాన్స్ లో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వ సాయాన్ని కోరుతుండటం గమనార్హం.

ప్రైవేటు రంగంలో పని చేస్తున్న కార్మికుల్లో 20 శాతం మందికి జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని.. ప్రభుత్వమే సాయం చేయాలని కోరుతున్నారు. థాయ్ లాండ్ దేశ జనాభాలో మూడో వంతు మంది (2.3కోట్లు) ప్రభుత్వం ఇచ్చే నగదు సాయానికి అప్లై చేసుకోవటం గమనార్హం. చైనాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నా.. రెండునెలలుగా కరోనా విలయతాండవటంతో దగ్గర దగ్గర 80 లక్షల మంది ఉపాధి కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా చూస్తే.. ఆ దేశం ఈ దేశం అన్నది తేడా లేకుండా.. ప్రపంచంలోని పలు దేశాల్లోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువంటున్నారు.