ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ని వీడి బీజేపీలోకి అడుగుపెట్టే ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.
కాగా… ఇప్పుడు ఈ ఉప ఎన్నిక ఇటు టీఆర్ఎస్ కీ.. అటు ఈటలకి చాలా కీలకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో ఈటల ఓడితే.. కేసీఆర్ కారణంగానే గతంలో ఆయన గెలిచారు అనే మాట వినాల్సి వస్తుంది.. అలా కాకుండా ఈటల గెలిస్తే.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ సత్తా పడిపోయిందీ అంటారు. అందుకే.. ఎవరికివారు ఈ ఉప ఎన్నికను సత్తాగా తీసుకున్నారు.
ఈ క్రమంలో ఎవరి ప్లాన్లు వారు అమలు చేస్తున్నారు. ఇప్పటికే.. ఓవైపు ప్రభుత్వపరంగా అభివృద్ది నిధుల పేరిట కోట్లాది రూపాయలను టీఆర్ఎస్ హుజురాబాద్ తీసుకెళ్తుండగా, టీఆర్ఎస్ ఎత్తులను చిత్తు చేసేందుకు ఈటల హుజురాబాద్ లోనే ఉండనున్నారు.
అధికారంలో ఉన్న పార్టీగా టీఆర్ఎస్ అన్ని రకాలుగా ఈటలను ఇబ్బందిపెట్టేందుకు రెడీ అయ్యింది. క్యాడర్ ఈటల వెళ్లకుండా జాగ్రత్తపడుతూనే… మంత్రులు, ఎమ్మెల్యేలను హుజురాబాద్ పంపింది. మండలానికో నేత, ఊరికో నాయకుడు ఇప్పుడు ఫోకస్ చేశారు.
అయితే, కేసీఆర్ ఎత్తులు ఎలా ఉంటాయో బాగా తెలిసిన ఈటల రాజేందర్…. తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నాడు. పేరుకు తను బీజేపీలో ఉన్నా అక్కడ ఫైట్ అంతా కేసీఆర్ వర్సెస్ ఈటల. తెలంగాణ ఉద్యమ నాయకులు వర్సెస్ బంగారు తెలంగాణ నాయకులు. దీంతో ఈటల తనతో పాటు నియోజకవర్గంలో పలు బాధ్యతలను ఉద్యమ నాయకులుగా ఉన్న స్వామిగౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ లకు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు వారంతా టీఆర్ఎస్ లో పనిచేసిన వారే. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న వారే. మంత్రి గంగుల సహా బీటీ బ్యాచ్ నాయకులకు కౌంటర్ గా ఉద్యమ నాయకులను బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పైగా తమకు ఉద్యోగులు అండగా ఉంటారని ధీమాగా ఉన్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు… హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ ఉద్యోగ సంఘం నేత అయిన స్వామిగౌడ్ ను యాక్టివ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.