అలకబూనిన పెద్దిరెడ్డి.. ‘కారు’ ఎక్కడానికి రెడీనా?

మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలకబూనారా..? ఈటల బీజేపీలో చేరడం ఈయనకు నచ్చడం లేదా..? ఈటలతో పాటు బీజేపీలో కొనసాగడం ఇష్టం లేక.. కారు ఎక్కడానికి సిద్ధమయ్యారా..? ప్రస్తుతం హుజురాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇవే హాట్ టాపిక్ గా మారాయి. ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో పెద్దిరెడ్డి కీలక నిర్ణయం తీసుకోనున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

హుజురాబాద్ బీజేపీ ఇంఛార్జిగా ఉన్న తనకు అదే నియోజకవర్గానికి చెందిన ఈటలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారనే విషయం కనీసం చెప్పలేదట. ఇలా తనకు చెప్పకుండా ఈటలను పార్టీలో చేర్చుకోవడం పట్ల పెద్దిరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆయన బాహాటంగానే తెలియజేయగా… పార్టీ రాష్ట్ర నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. డీకే అరుణను రంగంలోకి దింపి.. ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే.. ఆయన మాత్రం ఈ విషయంలో శాంతించడం లేదని తెలుస్తోంది. ఈటల కారణంగా పార్టీలో తన గుర్తింపు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకే.. కషాయం జెండాను వదిలేసి.. గులాబీ గూటికి వెళ్లాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక అటు టీఆర్ఎస్ కూడా.. ఈటలకు దీటుగా నాయకుడు కావాలని చూస్తోంది. అదే పెద్ది రెడ్డిని తమ పార్టీలో చేర్చుకొని సీటు కేటాయిస్తే… గెలిచే సత్తా ఉందా లేదా అనే సర్వేలు కూడా చేపడుతోందట. సర్వేలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తే.. పెద్దిరెడ్డి కారు ఎక్కించుకోవడానికి గులాబీ నేతలు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మరి ఆయన కారు ఎక్కుతారో లేక.. కషాయ కుండావానే మోస్తారో వేచి చూడాలి.