జంపింగ్‌ల‌కే జ‌గ‌న్ ప‌ద‌వులు… వైసీపీలో కొత్త కుంప‌ట్లు ?


ఏపీలో కింది నుంచి పై స్థాయి దాకా అన్ని ప‌ద‌వులు అధికార వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఏపీలో ఉన్న ప‌ద‌వుల్లో 99 శాతం ప‌ద‌వులు అన్ని వైసీపీ నేత‌ల‌కే ద‌క్కుతున్నాయి. అయితే ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ పార్టీ నేత‌ల్లో 40 మంది వ‌ర‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీరిలో కొంద‌రికి వీరు చేసిన త్యాగాలు, పార్టీ కోసం ప‌డిన క‌ష్టం నేప‌థ్యంలో ఎమ్మెల్సీ ఇస్తాన‌ని ఓపెన్‌గానే చెప్పారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డిన నేత‌లు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి న్యాయం చేస్తోన్న జ‌గ‌న్ కొంద‌రు క‌మిటెడ్ నేత‌ల విష‌యంలో మాత్రం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో వైసీపీలో అసంతృప్తి అనేది చాప‌కింద నీరులా పాకుతోంది.

పార్టీ కోసం కష్ట‌ప‌డిన వాళ్లు.. 2014, 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడినవారు, పార్టీ జిల్లా అధ్య‌క్షులుగా ఉన్నవారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌ర్వాత ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసిన వారు, వైసీపీ అభ్య‌ర్థుల చేతిల్లో ఓడిన వారికే ఇప్పుడు ప‌ద‌వులు ద‌క్కుతున్నాయి.. వారినే అంద‌లాలు ఎక్కిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు టీడీపీలో ఎంపీగా ఉన్న పండుల ర‌వీంద్ర‌బాబు వైసీపీలోకి వ‌చ్చిన వెంట‌నే ఎమ్మెల్సీ అయ్యారు. ఎస్సీ వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి కట్ట‌బెట్ట‌డంతో పార్టీలో ఉన్న సీనియ‌ర్ ఎస్సీ నేత‌లు ర‌గిలిపోతున్నారు. పార్టీ కోసం ప‌దేళ్లుగా క‌ష్ట‌ప‌డిన వారికి కాద‌ని.. పార్టీ కోసం ఏ మాత్రం క‌ష్టం లేకుండా ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన వారికి ఎమ్మెల్సీ ఇస్తార‌న్న అసంతృప్తి తీవ్రంగా ఉంది.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ప్ర‌స్తుత మంత్రి చెల్లుబోయిన వేణు చేతిలో ఓడిన తోట త్రిమూర్తులు వైసీపీలోకి వ‌చ్చిన వెంట‌నే జాక్‌పాట్ కొట్టేశారు. ఆయ‌న‌కు ఏకంగా అమ‌లాపురం పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి కూడా వ‌చ్చేసింది. తోట అంటే మంత్రి వేణుతో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు పిల్లి బోస్‌కు ఏ మాత్రం ప‌డ‌దు. వీరు తోట పార్టీ ఎంట్రీని తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయినా జ‌గ‌న్ పార్టీలో చేర్చుకుని రెండు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. పైగా అటు పండుల‌, ఇటు తోట ఇద్ద‌రూ ఒకే జిల్లా.. అందులోనూ గ‌తంలో టీడీపీలో క‌లిసి ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారే.

ఇక జ‌గ‌న్ ఐదారేళ్లుగా ఎమ్మెల్సీ ఇస్తా అన్నా అని చెప్పిన నేత‌ల‌కే ఇప్పుడు దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌డం లేదు. గొట్టిపాటి భ‌ర‌త్‌, జంకే వెంక‌ట‌రెడ్డి లాంటి వారు 2014 టైంలో పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డడంతో పాటు ఆర్థికంగా ఎంతో న‌ష్ట‌పోయారు. వీరికి జ‌గ‌న్ హామీ ఇచ్చి కూడా ప‌ద‌వులు ఇవ్వ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి నేత‌ల లిస్టు చాంతాడంత ఉంది. వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వైసీపీలో పెద్ద బ‌డ‌బాగ్ని ర‌గిలే ఛాన్సులే ఉన్నాయి. మ‌రి జ‌గ‌న్ వీరికి న్యాయం చేసి.. ఆ అస‌మ్మ‌తి జ్వాల‌ల‌ను ఎలా ఆర్పుతారో ? చూడాలి.