ఏపీలో మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ మార్పులు, చేర్పుల్లో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు తమకు బెర్త్ దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో ఐదు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. అయితే జగన్ తొలి మంత్రి వర్గంలో ప్రాంతీయ, సామాజిక సమీకరణల్లో 90 శాతం మంది జూనియర్లకే మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఈ సారి మాత్రం తమకు ఖచ్చితంగా బెర్త్ ఖాయమని ఎక్కువ మంది సీనియర్లు ఆశల పల్లకీలో ఉన్నారు. ఈ మార్పుల్లో కొందరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందన్న అంచనాలు అధికార పార్టీలో ఉంది.
వీరికి ప్రాంతీయ, సామాజిక సమీకరణలు కలిసి వస్తున్నాయి. ఇక జగన్ కొందరికి ఇప్పటికే మంత్రి పదవులపై హామీ ఇచ్చి ఉన్నారు. ఈ లిస్టులో గుంటూరు జిల్లాకే చెందిన మర్రి రాజశేఖర్ తో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఉన్నారు. ఇక తొలి టర్మ్‌లోనే ఖచ్చితంగా మంత్రి పదవి దక్కించుకోవాల్సిన కొందరు ఎమ్మెల్యేలకు అనేక కారణాలతో మంత్రి పదవులు రాలేదు. ఈ లిస్టులో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కూడా ఒకరు. జగన్ కోసం ముందే తన ఎమ్మెల్యే పదవి వదులుకున్న ఆయన 2012 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తన సొంత సీటు అయిన నరసాపురం వదులుకుని ఆచంటలో పోటీ చేసి ఓడిపోయారు.
2014లో అప్పటికప్పుడు పార్టీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు కోసం జగన్ సూచనల మేరకే ప్రసాదరాజు ఆచంటలో పోటీ చేసి ఓడిపోయారు. ఇలా జగన్ కోసం ఎన్నో త్యాగాలు చేసినా ఏనాడు క్రమశిక్షణ దాటలేదు. ఇక క్షత్రియ వర్గం కోటాలో 2019లోనే మంత్రి అవ్వాల్సి ఉంది. అయితే చెరుకువాడ రంగనాథరాజు జాతీయ స్థాయిలో క్షత్రియ నేతలతో జగన్‌పై ఒత్తిడి తేవడంతో పాటు బలమైన లాబీయింగ్ చేయడంతో జగన్ రంగనాథరాజుకు మంత్రి పదవి ఇవ్వక తప్పని పరిస్థితి. ఇక రంగనాథ రాజు వయస్సు నేపథ్యంలో ఆయన శాఖలో మరీ అంత సంచలనాలు ఏవీ నమోదు చేయలేదు.
అదే క్షత్రియ వర్గానికి చెందిన ఎంపీ రఘురామను కట్టడి చేసే విషయంలోనూ రంగనాథరాజు సక్సెస్ కాలేదన్న అభిప్రాయం జగన్‌కు ఉంది. ఏదేమైనా తనను నమ్ముకున్న ప్రసాదరాజుకు ఈ సారి బెర్త్ ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఉన్నత స్థాయి సమావేశాలు, నేతలతో కూడా ప్రసాదరాజుకు హింట్ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే రఘురామ విషయంలో క్షత్రియుల్లో వైసీపీ, జగన్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలు ఉన్నాయి. దీనికి బ్రేక్ వేసేలా జగన్ ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అన్న సందేహం కూడా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates