తీవ్ర ఉత్కంఠకు దారితీసిన నలుగురు నేతల ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో ఎట్టకేలకు .. గవర్నర్ విశ్వభూషణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నలుగురు నేతల్లో ఇద్దరి విషయం డోలాయమానంలో పడేసరికి సీఎం జగన్ హుటాహుటిన గవర్నర్ విశ్వభూషణ్‌ను కలిసి వివరణ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్సీ పోస్టులు ఇచ్చేందుకు గవర్నర్ ఓకే చెప్పారు.
గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన నాలుగు ఎమ్మెల్సీ పోస్టులకు వైసీపీ సర్కారు.. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్ రాజు, రమేశ్ యాదవ్‌ల పేర్లను సూచిస్తూ.. గవర్నర్‌కు నోట్ పంపించింది. అయితే ఇది జరిగి నాలుగు రోజులు అయింది. కానీ, గవర్నర్ దీనిని ఆమోదించలేదు. దీనికి కారణం.. జగన్ సర్కారు సూచించిన నలుగురిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉండడమే.
లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు.. గవర్నర్‌కు కూడా సమాచారం అందింది. దీంతో ఆయన హోం డిపార్ట్‌మెంట్ నుంచి సమాచారం తెప్పించుకుని.. ఫైల్‌ను నిలుపుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ ఇద్దరిపై వేటు తప్పదని.. జగన్ వేరేవారిని ఎంపిక చేయాల్సిందేనని వార్తలు వచ్చాయి. అయితే.. తాము సూచించిన నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించుకోవడాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ క్రమంలో హుటాహుటిన ఆయన గవర్నర్ అప్పాయింట్‌మెంట్ తీసుకుని.. ఆయనను కలిశారు. నామినేటెడ్ కోటాలో ఎంపికైన నలుగురి బయోడేటాను ఆయన సుదీర్ఘసమయం గవర్నర్‌కు వివరించిన ట్టు సమాచారం. రాజకీయ ప్రేరేపితమైన కేసులేనని.. అవి నిలిచేవి కావని కూడా వివరించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్.. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తుల అభ్యర్థిత్వాలకు పచ్చజెండా ఊపారు.