ఒక ఫొటో.. ఇండియాలో లాక్ డౌన్ కష్టాలకు అద్దం పడుతోంది. వలస కార్మికుల దయనీయ స్థితిని కళ్లకు కడుతోంది. లాక్ డౌన్ గురించి ఎవరు ఏం రాయాలన్నా దానికి సపోర్ట్‌గా ఆ ఫొటోను వాడుతున్నారు. సోషల్ మీడియాలో వలస కార్మికుల బాధల్ని చూపిస్తూ పెడుతున్న ఫొటోల్లో అది కచ్చితంగా ఉంటోంది. ఇంటికి చేరే మార్గం దొరక్క ఫోన్లో ఏడుస్తూ మాట్లాడుతున్న ఓ నడి వయస్కుడికి సంబంధించిన ఫొటో అది. దాని వెనుక కన్నీళ్లు తెప్పించే కథ ఉంది.
ఢిల్లీలో ఒక లేడీ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో అది. అందులో ఉన్న వ్యక్తి పేరు రామ్ పుకార్ పండిట్. అతడి వయసు 39 ఏళ్లు. రామ్ పుకార్ ఓ భవన నిర్మాణ కార్మికుడు. బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో పనులు చేసుకుంటున్నాడు. అతడికి భార్య, ముగ్గురు అమ్మాయి, ఓ అబ్బాయి ఉన్నారు. వాళ్లంతా తమ స్వస్థలంలోనే ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అతను రెండు నెలలుగా ఢిల్లీలోనే చిక్కుకుపోయి ఉన్నాడు. ఇంటికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
ఐతే ఇంతలో ఏడాది లోపు వయసున్న అతడి కొడుక్కి జబ్బు చేసింది. సరైన వైద్యం అందలేదు. దీంతో పరిస్థితి విషమించింది. అతడి ప్రాణం నిలిచే అవకాశం లేదని తేలిపోయింది. కొడుకును చివరి చూపు అయినా చూసుకుందామని బయల్దేరాడు రూప్ కుమార్. కానీ అతను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. అక్కడ కొడుకు ప్రాణం పోతోందని ఫోన్లో తెలుసుకున్న అతను విలవిలలాడిపోయాడు.
ఆ బాధతో ఏడుస్తూ మాట్లాడుతుండగా కెమెరా క్లిక్మంది. ఫొటో జర్నలిస్టు అతడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. డబ్బులిచ్చి, పోలీసుల అనుమతి కూడా సంపాదించి అతణ్ని ఢిల్లీ దాటించింది. ఐతే బీహార్‌లోని బెగుసరాయ్ సిటీకి చేరుకున్నాడు కానీ.. అక్కడి నుంచి తన గ్రామానికి వెళ్లలేకపోయాడు. ఈలోపే కొడుకు చనిపోయాడు. ఖననం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం బెగసరాయ్‌లోనే అతను క్వారంటైన్లో ఉన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates