ఎంఎల్సీ జాబితాపై వివాదం ?

జగన్మోహన్ రెడ్డి పంపించిన నాలుగుపేర్ల ఎంఎల్సీ జాబితాపై గవర్నర్ అభ్యంతరాలు చెప్పారా ? అవుననే అంటోంది ఓ సెక్షన్ మీడియా. గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన నాలుగు పోస్టులకు ప్రభుత్వం ఈమధ్యనే నాలుగు పేర్లను సిఫారసు చేసింది. రమేష్ యాదవ్, లేళ్ళ అప్పరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు పేర్లున్న ఫైల్ ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గరుంది.

అయితే సదరు మీడియా ప్రచారం ప్రకారం లేళ్ళ అప్పిరెడ్డి, తోట త్రిమూర్తుల పేర్లపై గవర్నర్ అభ్యంతరాలు తెలిపారట. ఎందుకంటే వాళ్ళిద్దరిపైన ఇప్పటికే కేసులున్నాయని చెప్పారట. నాలుగు పేర్ల ఫైల్ గవర్నర్ కు చేరుకున్న తర్వాత కొందరు తోట, లేళ్ళ పై నేరుగా గవర్నర్ కే ఫిర్యాదులు చేశారని సమాచారం.

తనకు అందిన ఫిర్యాదులను గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల నుండి గవర్నర్ ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్నారట. ఆ ఫీడ్ బ్యాక్ లో తనకొచ్చిన ఫిర్యాదులు కరెక్టే అని నిర్ధారణైందని సదరు మీడియా చెప్పింది. దాంతో రెండుపేర్లుపై గవర్నర్ అభ్యంతరం చెప్పారట. ఆ అభ్యంతరాలను క్లియర్ చేసేందుకే జగన్ ఈరోజు గవర్నర్ తో భేటీ అవుతున్నట్లు సదరు మీడియా చెప్పింది.

నిజానికి ప్రభుత్వం నుండి వచ్చిన జాబితాను క్లియర్ చేయక గవర్నర్ కు వేరేదారిలేదు. ఒకసారి రెజెక్టు చేసిన ఫైల్ ను గవర్నర్ రెండోసారి కూడా రెజెక్టు చేసేందుకు లేదు. అయితే ఇదే విషయంలో తాను అనుకున్న వారిని ఎంఎల్సీలుగా చేయటానికి జగన్ కు కూడా ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. గవర్నర్ కోటా కాకపోతే ఎంఎల్ఏల కోటాలో భర్తీ చేసేస్తారు.

అయితే జగన్ మాట్లాడిన తర్వాత గవర్నర్ జాబితాను మార్చాలని పట్టబట్టే అవకాశాలు తక్కువనే సమాచారం. ఎందుకంటే కేసులున్న వారికి పదవులు ఇవ్వకూడదన్నదే రూలైతే చాలామంది నేతలపై ఏదో ఒక కేసు ఉంటుంది. అప్పుడు పదవులు అందుకునేందుకు పేర్లే కరువవుతాయి అధినేతలకు. కాబట్టి జగన్ తో భేటీలో గవర్నర్ ఏమి చేస్తారనేది ఇపుడు ఆసక్తిగా మారింది.