కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసిన బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకోనున్నారు. ఈటెల విషయం ఇలాగుంచితే ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.

ఈ విషయంలోనే బీజేపీ లాటరీ కొట్టినట్లే అనే ప్రచారం జరుగుతోంది. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం ఈటెలతో పాటు మాజీ ఎంఎల్ఏ ఏనుగు రవీంద్రరెడ్డి, మాజీ ఎంపి రమేష్ రాథోడ్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ తుల ఉమతో పాటు మరికొందరు కూడా బీజేపీలో చేరబోతున్నారట. ఆర్టీసీ యూనియన్ లీడర్ అశ్వత్ధాతమరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి బీజేపీలో ఒకేసారి ఇంతమంది నేతలు ఎప్పుడూ చేరలేదు. గతంలో కూడా కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ నుండి కొందరు సీనియర్లు బీజేపీలో చేరినా వారంతా విడివిడిగా చేరారు. అంతేకానీ ఒకేసారి ఐదారుమంది సీనియర్ నేతలు కమలంపార్టీలో చేరలేదు. ఈటెలతో పాటు ఏనుగు, రమేష్ రాథోడ్, తుల ఉమ గట్టి నేతలుగా పేరున్న వాళ్ళనే చెప్పాలి.

ఒకేసారి అందులోను కేసీయార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా బీజేపీలో చేరటమంటే కమలం పార్టీకి హుషారు వచ్చినట్లే. మరి ఈటల రాజీనామా ద్వారా ఖాళీఅయిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూడాల్సిందే. ఆ ఎన్నికలో ఈటల మళ్ళీ గెలిస్తే కేసీయార్ వ్యతిరేకులంతా స్పీడవుతారు. లేకపోతే కేసీయార్ జోరే కంటిన్యు అవుతుంది.