కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయింది. మొన్నటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రాజేందర్ మీద సారుగుస్సా అయిపోవటం.. భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవిపై వేటు వేయటం తెలిసిందే. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు డిసైడ్ కావటం పాత విషయమే.
ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయిన ఈటల రాజేందర్ పార్టీకి వచ్చేందుకు తన సంసిద్ధతను తెలియజేయటంతో పాటు.. తనకున్న ఇబ్బందుల్ని వారి ముందు పెట్టినట్లుగా చెబుతారు. ఈటలకు బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా పార్టీలో చేరేందుకు సిద్ధమైన ఈటల.. అందుకు ఈ నెల 14ను ముహుర్తంగా డిసైడ్ చేసుకోవటం తెలిసిందే. తనతో పాటు మరికొందరు నేతల్ని కూడా బీజేపీలో చేర్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లనున్న ఈటల.. అందుకోసం ఎప్పటి మాదిరి కాకుండా రోటీన్ కు భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
బీజేపీలో చేరే వేళ.. తనతో పాటు తన ముఖ్యమైన ఫాలోయిర్లను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్ ను బుక్ చేసినట్లుగా తెలుస్తోంది. మిగిలిన నేతలకు భిన్నంగా.. కాస్త హడావుడి ఉండేలా తన పార్టీ జాయినింగ్ పోగ్రాం ఉండాలని ఈటల భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.అందుకే చార్టెడ్ ఫ్లైట్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది.