జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. పోయినేడాది కూడా బాలయ్య పుట్టిన రోజు నాడు మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా తారక్ రాజకీయ అరంగేట్రంపై ప్రశ్న ఎదురైంది. అప్పుడాయన ఎవరిష్టం వాళ్లదన్నట్లుగా ఒక కామెంట్ చేసి వదిలేశాడు. అప్పుడు దాని గురించి పెద్ద చర్చ జరగలేదు. కానీ ఈసారి పుట్టిన రోజు సందర్భంగా ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తారక్ గురించి బాలయ్య స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
జూనియర్ పట్ల బాలయ్యకు సదభిప్రాయం లేదని, అతను రాజకీయాల్లోకి రావడం బాలయ్యకు ఎంతమాత్రం ఇష్టం లేదని స్పష్టంగా తెలిసిపోయింది తాజా వ్యాఖ్యలతో. ప్రస్తుతం చంద్రబాబు వారసుడిగా తెలుగుదేశం పార్టీలో ప్రొెజెక్ట్ అవుతున్న నారా లోకేష్ బాలయ్యకు అల్లుడు. అలాగే బాలయ్య మరో అల్లుడు భరత్ రాజకీయాల్లో ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తారక్ పార్టీలోకి వస్తే వీళ్లకు ఇబ్బంది అవుతుందని బాలయ్య భావిస్తుండొచ్చు. ముఖ్యంగా లోకేష్ గురించే ఆయన ఆందోళన చెందుతున్నట్లుగా భావిస్తున్నారు.
తారక్ వస్తే పార్టీకి ప్లస్ కాకపోగా మైనస్ అయితే అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎనలేని ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తారక్ పట్ల ఆయనెంత వ్యతిరేకతతో ఉన్నాడో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఇదిలా ఉంటే.. ఈ విషయమై మాట్లాడుతూ బాలయ్య మరో కామెంట్ కూడా చేశాడు.
తెలుగు దేశం పార్టీ పారదర్శకత (ట్రాన్స్పరెంట్)తో పుట్టిందని.. తాను చాలా పారదర్శకంగా ఉంటానని.. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పారదర్శకమే అని.. అలాంటి వాళ్లకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని.. ఈ పార్టీలో ఏదీ డిప్లమాటిగ్గా ఉండదని బాలయ్య కామెంట్ చేశాడు. ఆయన తారక్ గురించి మాట్లాడుతున్నపుడు ‘ట్రాన్స్పరెంట్’ అనే పదాన్ని మళ్లీ మళ్లీ వాడటం ద్వారా అతను అంత ట్రాన్స్పరెంట్గా ఉండడనే విషయాన్ని చెప్పకనే చెప్పాడనే భాష్యం వస్తుండటం గమనార్హం.