కామెడీ అయిపోయిన వైసీపీ మంత్రి

చేసినవి చెప్పుకుంటేనే అతిశయోక్తిగా చూసే రోజులివి. సామాజిక మాధ్యమాల్లో శూల శోధన చేసి ఆ గొప్పల్లో ఉన్న తప్పులేంటో బయటికి తీసి పెట్టేస్తారు నెటిజన్లు. అలాంటిది చేయనివి చెప్పుకుంటే వాళ్లు ఊరుకుంటారా? ఇలా చేసే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నవ్వుల పాలవుతున్నారు. రెండేళ్ల కిందట జగన్ సర్కారు వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడకేసిందని, ఉన్న కంపెనీలను ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొడుతూ.. కొత్త పరిశ్రమలు రాకుండా అడ్డం పడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య జనాల్లోకి కూడా ఈ విషయం బాగా వెళ్లిపోయింది. కేవలం సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతూ అభివృద్ధిని పట్టించుకోవట్లేదంటూ జగన్ ప్రభుత్వంపై తరచుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ప్రచారం నిజం కాదని చెప్పాలనుకున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి మరీ గత రెండేళ్లలో రాష్ట్రంలోకి కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి వెల్లడించారు. తాము టీడీపీ ప్రభుత్వంలా గొప్పలకు పోవడం లేదని, చేసింది కూడా సరిగా చెప్పుకోవడం లేదని ఆయనన్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలోకి పదుల సంఖ్యలో కొత్త కంపెనీలు వచ్చాయని, వేల కోట్ల పెట్టుబడులు తేగలిగామని ఆయనన్నారు. ఈ వివరాలతో ఒక జాబితాను కూడా మీడియాకు రిలీజ్ చేశారాయన. ఐతే అందులో మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ల లిస్ట్ చూస్తే అవన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చినవని ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ముఖ్యంగా అనంతపురంలో కియా కంపెనీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనత అని ఎవ్వరినడిగినా చెప్పేస్తారు. కానీ ఈ కంపెనీ 2019 ఆగస్టులో వచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. అలాగే చిత్తూరులో వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన అపోలో టైర్స్, హీరో మోటాకార్ప్ సంస్థల రాక కూడా వైసీపీ ప్రభుత్వ ఘనతగా చెప్పుకున్నారు. కానీ ఇవి కూడా బాబు హయాంలో వచ్చినవే.

వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 65 కంపెనీలు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా రూ.30 వేల దాకా పెట్టుబడులు వచ్చాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇందులో పైన చెప్పుకున్న మూడు కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువే రూ.15 వేల కోట్లకు పైగా ఉండటం విశేషం. మిగతా జాబితాలోనూ కొన్ని బాబు హయాంలో వచ్చినవే అంటూ ఆధారాలతో సహా టీడీపీ మద్దతుదారులు ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. ట్విట్టర్లో ఈ జాబితాను పంచుకున్న గౌతమ్ రెడ్డి కామెంట్ సెక్షన్ డిజేబుల్ చేయడాన్ని చూస్తే ఈ జాబితా మీద ఆయనకే విశ్వాసం లేనట్లుంది. గత ప్రభుత్వ ఘనతల్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూసి గౌతమ్ రెడ్డి కామెడీ అయిపోతున్న మాట వాస్తవం.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)