జగన్మోహన్ రెడ్డికి కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా కరోనా వైరస్ మందును సరపరా చేస్తానని చెప్పారు. అయితే ఆనందయ్య లేఖపై స్పందించటం ప్రభుత్వానికి అంత ఈజీకాదు. ఎందుకంటే సానుకూలంగా స్పందిస్తే ఒక సమస్య. అలాగని నిరాకరిస్తే మరోసమస్య.
సాధ్యాసాధ్యాల గురించి, క్షేత్రస్ధాయిలో వాస్తవాల గురించి లాజికల్ గా ఆలోచించే ప్రతిపక్షాలు లేవు కాబట్టే ప్రతి చిన్న విషయం ఏపిలో రాజకీయ వివాదమైపోతోంది. తన మందుకు ప్రభుత్వం అసలు ఏ పద్దతిలో సహకరించాలని అనుకుంటున్నారో ఆనందయ్య చెప్పలేదు. ముడిదినుసులు సప్లై చేయాలా ? లేకపోతే రవాణా సౌకర్యాలు కల్పించాలా ? అనే విషయంలో స్పష్టతలేదు.
అలాగే ఇపుడు ఆనందయ్య మందుకు ప్రభుత్వం సహకారం అందిస్తే రేపు మరో పదిమంది ఆనందయ్యలు పుట్టుకురారని గ్యారెంటీలేదు. ఆనందయ్యకు సహకరించిన ప్రభుత్వం ఇతరులకు నిరాకరించేందుకు లేదు. ఇతరులకు నిరాకరిస్తే అప్పుడు మరో వివాదమవుతుంది. అసలు ప్రభుత్వం మద్దతుతోనే ఆనందయ్య మందేమీ పంపిణీ చేయటంలేదు. తనంతట తానుగానే చుక్కులమందు పంపిణీ ప్రారంభించిన ఆనందయ్య ఇపుడు కొత్తగా ప్రభుత్వ సహకారం ఎందుకు కోరుతున్నారో అర్ధం కావటంలేదు.
ఆనందయ్య మందుకు హైకోర్టు ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా తనంతట తానుగా అడ్డుకోలేదన్నది వాస్తవం. కాబట్టి తాను చేయగలిగినంతలో ఆనందయ్యే మందు తయారీ, పంపిణీ చేసుకోవటమే ఉత్తమం. కావాలంటే ఇతర ప్రాంతాల్లో తన మందు తయారీ, పంపిణీకి శిష్యుల సహకారం తీసుకోవటంలో తప్పులేదు. ఆనందయ్య కొడుకు సహకారంతో చంద్రగిరిలో ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి తన సొంత ఖర్చులతో మందు పంపిణీకి ఎలా చొరవ చూపించారో అలాగే ఇతరులు కూడా ముందుకొస్తే ఆనందయ్య సాయం తీసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates