షర్మిల పార్టీకి టేబుల్ ఫ్యాన్?

తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న షర్మిల పార్టీకి సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే నెల (జులై) 8న పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి.. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. షర్మిల పెట్టే పార్టీ పేరును ఇటీవలే ప్రకటించటం తెలిసిందే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. పొట్టిగా చెప్పాలంటే వైఎస్సార్ టీపీగా డిసైడ్ చేసి.. ఆ పేరు మీదన ఈసీలో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు.

ఏపీలో ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ పేరు ఉండటం.. దానిలో తెలంగాణ ఒక్కటి మాత్రమే యాడ్ అయ్యింది. దీంతో.. ఒక పార్టీని పోలినట్లుగా మరో పార్టీ పేరు ఉండటంపై ఈసీ వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ.. తన కుమార్తె తెలంగాణలో పెట్టే పార్టీకి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ ఈసీకి లేఖ రాసినట్లుగా చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరు మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఏప్రిల్ 30న కేంద్ర ఎన్నికల సంఘం తన వెబ్ సైట్ లో కోరగా.. ఇప్పటివరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో.. ఈసీ నుంచి పార్టీ అనుమతుల ప్రక్రియ పూర్తి అయినట్లుగా షర్మిల వర్గం భావిస్తోంది. షర్మిల పెడుతున్న పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టేబుల్ ఫ్యాన్ గుర్తును కేటాయించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడలేదు. ఇదెంత వరకు నిజమన్నది ఈసీ స్వయంగా ప్రకటిస్తేనే స్పష్టత వస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరేం చేస్తారో చూడాలి.