ఏపీలో కరోనా కట్టడి కోసం జగన్ సర్కారు కొన్నాళ్లుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ దశల వారీగా పెంచుతున్నారు. గత నెలలో ప్రారంబించిన ఈ కర్ఫ్యూను తొలుత రెండు వారాలుగా అమలు చేశారు. అయితే.. సాధారణ ప్రజలకు, వ్యాపారులకు, హాకర్లకు ఒకింత వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలోనే ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక, మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
కర్ఫ్యూ సమయంలో ఎలాంటి వ్యాపారాలు జరగకుండా.. ప్రజలు రోడ్ల మీదకు రాకుండా ప్రభుత్వం కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయితే.. అదేసమయంలో అత్యవసర సేవలు సహా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రజా జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు అంటే.. ఈ నెల 1న తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 10తో కర్ఫ్యూ ముగి యనుంది. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కర్ఫ్యూను మరో 10 రోజుల పాటు పొడిగించారు. అయితే.. ఈ పొడిగింపులోనూ ప్రజలకు ఒకింత సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కర్ఫ్యూ వెసులుబాటును మరో రెండు గంటలు పెంచారు. అంటే.. ఈ నెల 10వ తారీకు నుంచి కర్ఫ్యూ వెసులుబాటు సమయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. తాజాగా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం ప్రకటించారు.
ఈ నిర్ణయంతో వ్యాపారులకు, హాకర్లకు, సాధారణ ప్రజానీకానికి మేలు జరుగుతుందని.. మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ వెసులుబాటుతో వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సర్కారు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక, ఇదేసమయంలో అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల ఆఖరుతో కర్ఫ్యూను దాదాపు ఎత్తివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. దీంతోనే సీఎం కర్ఫ్యూను సడలించారని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates