కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రాజకీయ నాయకుల మధ్య గోడలు కూలిపోతున్నారు. అంతరాలు చెరిగిపోతున్నాయి. ఈ సమయంలో రాజకీయ వైరుధ్యాల్ని పక్కన పెట్టి అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కరోనాపై పోరులో భాగంగా ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి కూడా సలహాలు తీసుకుంటున్నారు. సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజాగా ఆయన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీలకు ఫోన్ చేసి మాట్లాడటం విశేషం. ఇంకా వివిధ పార్టీల అగ్ర నాయకులతో మోడీ సంప్రదింపులు జరిపినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది.
మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలతో పాటు.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్‌లకు మోడీ ఫోన్ చేసి కోవిడ్-19 వ్యాప్తిని నివారించడంలో సలహాలు కోరినట్లు తెలిసింది.
అలాగే సోనియా గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ అగ్ర నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి-పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, పంజాబ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు కూడా వ్యక్తిగతంగా ప్రధాని ఫోన్ చేసి కరోనాపై సలహాలు కోరారు.
ప్రధాని కొన్ని రోజులుగా వివిధ రంగాల ప్రముఖులతోనూ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల కిందట 40 మంది స్పోర్ట్స్ సెలబ్రెటీలతో మోడీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫిలిం సెలబ్రెటీలతోనూ టచ్‌లో ఉన్నారు. కరోనాపై పోరాడుతున్న వాళ్లందరికీ వ్యక్తిగతంగా అభినందనలు చెబుతున్నారు. వారిలో ప్రోత్సాహాన్ని నింపుతున్నారు. ఐతే రాజకీయ ప్రత్యర్థుల్ని సైతం ఈ పోరులో భాగం చేయడం మాత్రం మోడీ ఇమేజ్ను పెంచేదే.