లక్షద్వీప్.. మనదేశం ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం. నిన్న మొన్నటి వరకు పెద్దగా వార్తల్లోకి రాని ఈ ప్రాంతం.. ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరిని నిరిశిస్తూ.. భారీ ఎత్తున ప్రధాని మోడీకి లేఖలు రావడం సంచలనంగా మారింది. దీంతో అసలు లక్షద్వీప్‌లో ఏం జరుగుతోంది? అనే చర్చ సర్వత్రా జరుగుతుండడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
2020 డిసెంబర్ 4న లక్షద్వీప్ పాలనాధికారి దినేశ్వర్ శర్మ మరణించారు. ఆయన స్థానంలో గుజరాత్ మాజీ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు సన్నిహితుడైన ప్రఫుల్ ఖోడా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. దమణ్, దీవ్లకు పాలనాధికారిగా ఉన్న ఈయనకే లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించారు. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు.
సంస్కరణల కొరడా!
ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయి. లక్షద్వీప్ ప్రజలు తమ సంస్కృతిని గొప్పగా భావిస్తారు. ప్రకృతిని కాపాడుకోవడాన్ని తమ బాధ్యతగా పరిగణిస్తారు. ఈ కేంద్రపాలిత ప్రాంత రక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మద్యం విక్రయాలు ఉండవు. బయటి వ్యక్తులు భూమిని కొనుగోలు చేసే అధికారం ఉండదు. స్థానికేతరులు ఇక్కడికి రావాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ప్రఫుల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన.. లక్షద్వీప్ జంతు సంరక్షణ చట్టం, సామాజిక వ్యతిరేక కార్యకలాపాల చట్టం, డెవెలప్మెంట్ అథారిటీ చట్టం, పంచాయతీ సిబ్బంది నియమాల సవరణ వంటి చట్టాలు ప్రజల ఆగ్రహానికి లోనవుతున్నాయి.
పోలీసులకు మరిన్ని అధికారాలు
ఎవరినైనా నిర్బంధించేలా లక్షద్వీప్ పోలీసులకు అధికారాలు ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కొద్దిరోజుల నుంచి దీనిపై సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ జరుగుతోంది. ‘సేవ్ లక్షద్వీప్’ పేరుతో ట్విట్టర్లో హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేరళలోని అధికార విపక్ష కూటములు లక్షద్వీప్ వాసులకు మద్దతుగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఇక, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతిశీల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అధికారాలను డెవెలప్మెంట్ అథారిటీ చట్టం కల్పిస్తుంది. భూమిని అభివృద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. మైనింగ్, ఇంజినీరింగ్, భవన నిర్మాణాలు చేపట్టే వీలు కల్పిస్తుంది. అయితే, అభివృద్ధి పేరిట మైనింగ్, క్వారీయింగ్ చేపట్టడాన్ని ఇక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
విస్తరణ వివాదం..
రోడ్ల విస్తరణ మరో వివాదంగా మారింది. ఈ ప్రాంతంలో రోడ్ల విస్తరణ చేపట్టాలని పటేల్ ఆదేశాలు ఇచ్చారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న ఇళ్లను ధ్వంసం చేయమని ఆదేశించారు. లక్షద్వీప్లో ఉన్న వాహనాల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ ఉన్నవి ద్విచక్రవాహనాలే! అలాంటప్పుడు ఇళ్లు తొలగించి మరీ రోడ్ల విస్తరణ చేపట్టే అవసరమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బీఫ్ నిషేధం
లక్షద్వీప్ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని డెయిరీ ఫామ్లను నూతన పాలనాధికారి పటేల్ మూసేయించారు. గోవధ నిషేధం, బీఫ్ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోళ్లను నివారించేందుకే ఇలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో మాంసాహార మెనూను సైతం తొలగించారు. ఇదిలావుంటే, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లల నిబంధన విధించేలా నూతన చట్టం ప్రతిపాదించారు పటేల్. కొందరు ప్రముఖ నేతలను పోటీ నుంచి తప్పించేందుకే ఈ నిబంధన పెట్టారని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.
ప్రధానికి లేఖలు..
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో అభివృద్ధి పేరుతో చేపట్టిన చర్యలపై 93 మంది మాజీ ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. స్థానిక ప్రజలను సంప్రదించిన తర్వాతే ఆ ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను ఎంపిక చేయాలని, వారి భద్రత, ఆరోగ్య పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు భరోసా కల్పించాలని సూచించారు. ఆ ప్రాంత భౌగోళిక ప్రత్యేకతను, సాంస్కృతిక భిన్నత్వాన్ని కాపాడాలని కోరారు. లెఫ్టినెంట్ గవర్నర్ పటేల్‌పై వారంతా పరోక్షంగా విమర్శలు గుప్పించడం గమనార్హం. ప్రస్తుతం ఈ పరిణామం.. అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు లక్షద్వీప్‌ను కూడా కుదిపేస్తుండడం గమనార్హం.
This post was last modified on June 7, 2021 9:45 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…