బాబు ఫార్ములాను ఫాలో అవుతున్న జ‌గ‌న్‌?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రించిన పొలిటిక‌ల్ ఫార్ములానే వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అనుస‌రి స్తున్నారా? బాబు న‌డిచిన బాట‌లోనే జ‌గ‌న్ అడుగులు వేస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నేత‌లు. ప్ర‌స్తుతం ఈ విష‌యం వైసీపీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం. విష‌యం ఏంటంటే.. రాష్ట్రంలో శాస‌న మండ‌లి చైర్మ‌న్, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వులు ఖాళీ అవుతున్నాయి. వీటిలో చైర్మ‌న్ ప‌ద‌వి అయితే.. ఖాళీ అయిపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు చైర్మ‌న్‌గా ఉన్న మ‌హ్మ‌ద్ ష‌రీఫ్‌.. ఇటీవ‌లే మండ‌లి నుంచి రిటైర్ అయ్యారు. అదేవిధంగా డిప్యూటీ చైర్మ‌న్‌గా ఉన్న రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం.. ఈ నెల 18న రిటైర్ అవుతున్నారు. దీంతో ఈ రెండు ప‌ద‌వుల‌ను ఫిల‌ప్ చేయాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. గ‌తంలో చంద్ర‌బాబు ఈ రెండు ప‌ద‌వుల విష‌యంలో ఒక నూత‌న ఒర‌వ‌డిని తీసుకువ‌చ్చారు. చైర్మ‌న్ ప‌ద‌విని మైనారిటీ వ‌ర్గానికి కేటాయించాల‌ని పార్టీలో తీర్మానం చేశారు. అదేస‌మ‌యంలో డిప్యూటీ చైర్మ‌న్ ఓసీ లేదా బీసీ వ‌ర్గాల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీకి అత్యంత విధేయుడుగా ఉన్న.. ష‌రీఫ్‌ను మండ‌లికి చైర్మ‌న్‌ను చేశారు. రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని డిప్యూటీ చైర్మ‌న్ ప‌దవి ఇచ్చి గౌర‌వించారు. ఇది .. చంద్ర‌బాబుకు మంచి పేరు తెచ్చింది. మైనార్టీ వ‌ర్గానికి ఆయ‌న ప్రాదాన్యం ఇచ్చార‌ని పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్త‌మైంది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే ఫార్ములాను అనుస‌రించి.. మార్కులు కొట్టేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు వైసీపీలో నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీకి ఎంతో విధేయుడు, అందునా.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ఉన్న మ‌హ్మ‌ద్ ఇక్బాల్‌కు మండ‌లి చైర్మ‌న్ పోస్టును క‌ట్ట‌బెట్టాల‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అదేవిధంగా.. డిప్యూటీ చైర్మ‌న్ పోస్టుకు గుంటూరు జిల్లాకు చెందిన బీసీ సామాజిక వ‌ర్గం నేత‌.. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణ‌మూర్తికి ఇస్తార‌ని అంటున్నారు. నిజానికి వీరిద్ద‌రికీ ఇవ్వ‌డంపై పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయినా.. జ‌గ‌న్ నిర్ణ‌యం మాత్రం దాదాపు ఇదే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.