అంచనాలు నిజం చేస్తూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవితోపాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక అడుగుతారని 19 ఏళ్ల పాటు పార్టీకోసం శ్రమిస్తే తన విషయంలో కేసీఆర్ వైఖరి అలా కూడా లేదన్నారు. ఓ అనామకుడు లేఖ రాస్తే మంత్రి మీద విచారణ జరపడం, ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికి రాత్రే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ సందర్భంగా ఈటల కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు తెరతీస్తున్నాయి.
టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత పరిణామాల గురించి స్పందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ గురించి సైతం కామెంట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. ఈ కామెంట్లు హస్తం పార్టీలో కలవరం సృష్టించాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీని వీడిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ పై తప్పుడు కామెంట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్ళు కేసీఆర్ వెంటే ఉన్న ఈటల ఇప్పుడు పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడని ఈటల వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను సరైన రీతిలో పోషించడం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. హస్తం పార్టీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో బీజేపీ బలపడుతోందని కూడా పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులను ఖండించినప్పటికీ ఆ పార్టీలో అంతర్మథనం మొదలైందని అంటున్నారు.