నెల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన వైద్యుడు సుధాకర్.. డాక్టర్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాస్కులు కూడా ఇవ్వట్లేదంటూ జగన్ సర్కారు మీద విమర్శలు, ఆరోపణలు చేసి వార్తల్లో నిలవడం, ఆ తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిన సంగతే. ఇప్పుడాయన విశాఖపట్నంలో నడి రోడ్డుపై దారుణమైన స్థితిలో కనిపించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. మద్యం తాగారో లేక మతి స్థిమితం తప్పిందో కానీ.. ఆయన రోడ్డు మీద అర్ధనగ్న స్థితిలో అసలేం మాట్లాతున్నారో తెలియని స్థిలిలో కనిపించారు. సుధాకర్‌ను అదుపు చేయడం కోసం పోలీసులు ఆయన కాళ్లు చేతులకు తాళ్లు కట్టి.. కర్రలతో కొట్టడం దారుణమైన విషయం.
సస్పెన్షన్ సుధాకర్ మీద మానసికంగా తీవ్ర ప్రభావమే చూపించినట్లు కనిపిస్తోంది. ఆయన ఒంటిపై చొక్కా లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుధాకర్ నిరసన ప్రదర్శనకు దిగి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ను బూతులు తిట్టడం.. రోడ్డు మీద వచ్చే పోయే వారిని అడ్డుకోవడం చేస్తుంటే పోలీసులు వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గుండు చేయించుకుని గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న సుధాకర్‌ను మీడియా వాళ్లు ఏం జరిగిందని అడిగితే.. ఆయన మాటలు తడబడ్డాయి. జగన్‌ను బూతులు తిడుతూ.. తానేం తప్పు చేయలేదంటూ ఏదో చెప్పే ప్రయత్నం చేశారు.
సంబంధిత వీడియోను తెలుగుదేశం నేత నారా లోకేష్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘‘జగన్ గారిది క్రూరమైన మనస్తత్వం. మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్‌ను నియంతలా సస్పెండ్ చేశారు. ఒక దళిత డాక్టర్‌ను తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం జగన్ ఉన్మాదానికి పరాకాష్ట. వైసీపీ ప్రభుత్వ దుర్మార్గ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారు. నిజాలు బయటపెట్టిన ఉత్తమ వైద్యుడైన సుధాకర్ గారి పై కక్ష కట్టి వేధిస్తున్న జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates