ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కెరీర్ స్టార్ట్ చేశారు. తర్వాత వైసీపీలోకి వచ్చి మూడోసారి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. జమ్మలమడుగు రాజకీయాలను రెండు దశాబ్దాలపాటు ఏకచక్రాధిపత్యంగా శాసించారు. అంతా బాగానే ఉంది. ఎప్పుడు అయితే మంత్రి పదవికి ఆశపడి టీడీపీలో చేరారో అప్పుడే ఆయన రాజకీయ పతనం ప్రారంభమైపోయింది. కేవలం రెండేళ్లు మంత్రిగా ఉన్నాం.. జిల్లాను ఏదో శాసించాం అన్న పేరు తప్పా టీడీపీలో ఆదినారాయణ రెడ్డికి వ్యక్తిగతంగాను, రాజకీయంగాను ఒరిగిందేమి లేదు. పైగా గత ఎననికల్లో తనకు ఇష్టమైన జమ్మలమడుగు సీటును కాదని.. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
అదే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి వైసీపీలో ఉండి ఉంటే.. జిల్లాలో కీలక నేతగా గుర్తింపు దక్కేది. వీలును బట్టి కనీసం రెండేళ్లు అయినా ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యి ఉండేవారు.. అటు జమ్మలమడుగు కింగ్‌గా కంటిన్యూ అయ్యేవారు. గత ఎన్నికల్లో ఓడిన వెంటనే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు పేరుకు మాత్రమే ఆయన కాషాయ కండువా వేసుకున్నారని.. రేపటి రోజున టీడీపీ అధికారంలోకి వస్తే ఆయన మళ్లీ కండువా మార్చకుండా ఉంటారన్న గ్యారెంటీ లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొందరు అయితే వచ్చే ఎన్నికలకు ముందే ఆయన టీడీపీ కండువా కప్పుకుని మళ్లీ జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ప్రస్తుతం ఆది తీరు కూడా అనేక సందేహాలకు తావిచ్చేలా ఉంది. చంద్రబాబు ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తున్నా జమ్మలమడుగులో ఎవ్వరిని నియమించలేదు. ఇక ఇటీవల స్థానిక ఎన్నికలలో అసలు జమ్మలమడుగు, ఎర్రగుండ్ల మున్సిపాల్టీలతో పాటు పంచాయతీలకు కూడా టీడీపీ అభ్యర్థులను పోటీలో పెట్టలేదు. అక్కడ ఆదినారాయణ ఫ్యానెల్లో పోటీగా ఉన్న బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఏపీ వ్యాప్తంగా జమ్మలమడుగులోనే బీజేపీ కాస్తంత ప్రభావం చూపించింది. ఇదంతా ఆదినారాయణ వ్యక్తిగత ప్రాబల్యం.
వచ్చే మూడేళ్లలో స్థానికంగా తనకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు, తన వర్గాన్ని కాపాడుకునేందుకే ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉన్నారని.. ఆయన పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నారని.. బాబు కూడా ఆయనకు ఫుల్లుగా కోపరేట్ చేస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఆయన బీజేపీలో కోవర్టుగా ఉన్నారన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఆది ఎప్పటి వరకు ఎప్పటకీ బీజేపీలోనే ఉంటారా ? ఇప్పటికే నాలుగు కండువాలు మార్చినట్టు మళ్లీ కండువా మార్చేస్తారా ? అన్నది కాలమే నిర్ణయించాలి.