తెలంగాణలో రాజకీయ పార్టీ పెడతానని ఏపీ సీఎం వైఎస్. జగన్ సోదరి వైఎస్. షర్మిల చేసిన ప్రకటనే రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపింది. షర్మిల పార్టీ ప్రకటన తెలంగాణ కంటే కూడా ఏపీలో పెద్ద కుదుపు కుదిపింది. అన్న ఇక్కడ సీఎంగా ఉంటే చెల్లి షర్మిల పక్క రాష్ట్రంలో పార్టీ ఎలా ? పెడతారని పెద్ద చర్చలే నడిచాయి. ఏదేమైనా షర్మిల పార్టీ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆమె తెలుగు మీడియాలో హైలెట్ అవుతూ వచ్చారు. ఒక్కసారిగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు నెల రోజుల పాటు వార్తలు అన్నీ టీఆర్ఎస్ కంటే కూడా షర్మిల, ఆమె కొత్త పార్టీ చుట్టూనే తిరిగేశాయి.
నిజం చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. ఆమె పార్టీ పెట్టాలనుకుంటే కరెక్టు టైం కూడా ఇదే. కేసీఆర్‌ను వ్యతిరేకించి గట్టిగా ఒక్క ముక్క మాట్లాడే వాళ్లు కూడా లేకుండా పోయారు. ఈ టైంలో షర్మిల వచ్చీ రావడంతోనే కేసీఆర్‌ను, టీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని విమర్శలు బాణాలు అయితే బాగానే సంధించారు. ఖమ్మం సభను ఆర్భాటంగా జరపాలని ఆరాట పడితే కరోనా ఆమె ఉత్సాహంపై నీళ్లు జల్లింది. ఇంకా కొత్త పార్టీ ప్రకటన రాకుండానే షర్మిల తెలంగాణ రాజకీయాలు కాదు కదా రాజకీయ వార్తల్లోనే సైడ్ అయిపోయారు.
కేసీఆర్ ఎప్పుడు అయితే ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేశారో.. అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు అన్ని ఈటల కేంద్రంగా వేడెక్కాయి. అయితే ఈటల, లేకపోతే ఈటలపై విమర్శలు చేస్తోన్న గంగుల లేదా టీఆర్ఎస్ నాయకులో అన్నట్టుగా అక్కడ రాజకీయ వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వార్తలు అన్నీ హుజూరాబాద్, కరీంనగర్ కేంద్రంగానే నడుస్తున్నాయి. దీంతో తెలంగాణలో రాజకీయ నేతలే కాదు… మీడియా వాళ్లు కూడా షర్మిలను పట్టించుకునే పరిస్థితి లేదు.
దీంతో రాజకీయ పార్టీకి పేరు పెట్టకముందే.. రాజన్న బిడ్డ షర్మిల భవిష్యత్ అగమ్యగోచరంలో పడింది. మహిళలు, నిరుద్యోగుల కోసం షర్మిల రెండు కార్యక్రమాలు పెట్టారు. నిరాహార దీక్షలకు కూర్చొన్నారు. ఎవ్వరూ పట్టించుకునే వాళ్లు లేక చివరకు వాళ్లే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఏ పార్టీలో ప్రాధాన్యం లేని వారంతా హడావిడిగా షర్మిల వెనకాల చేరారు. ఇప్పుడు ఈటల మరికొందరు నేతలతో కలిసి కొత్త పార్టీ పెడితే షర్మిల పార్టీని పట్టించుకునే వాళ్లే ఉండరని అంటున్నారు. నిన్నమొన్నటి వరకు కేసీఆర్‌పై పోరాడాలంటే షర్మిలే అన్న వారంతా ఇప్పుడు కేసీఆర్ చేతిలో దెబ్బతిన్న ఈటల కంటే ఎవరు పోరాడతారని అంటున్నారు. ఏదేమైనా ఈటల విషయంలో కేసీఆర్ చేసిన రాజకీయంతో షర్మిల రాజకీయం బొక్క బోర్లాపడినట్టే అంటున్నారు విశ్లేషకులు..!