విషయం ఏదైనా కావొచ్చు. చిన్న తప్పులకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. కరోనా విషయంలో ఏ చిన్న ఏమరపాటు సరికాదు. ఈ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆయన చుట్టు ఉన్నవారు ఎందుకు మర్చిపోతున్నారు. ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లుగా ఏపీ సీఎం ముఖానికి మాస్కుపెట్టుకోకపోవటం తెలిసిందే. చాలా ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి ఆయన ముఖానికి మాస్కు పెట్టుకోరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ ను అభిమానించేవారు.. ఆయన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వారు చాలామందే ఉంటారు. అలాంటి వారంతా జగన్ ను స్ఫూర్తిగా తీసుకొని మాస్కు పెట్టుకోకపోవటం చూస్తున్నదే.
తన కోసం కాకున్నా.. తన చుట్టూ ఉన్న వారి కోసమైనా సరే జగన్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా బడ్జెట్ ప్రవేశ పెట్టే నేపథ్యంలో 2020-21 సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ప్రణాళిక శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి విజయ్ కుమార్ కలిసి నివేదికను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు పక్కపక్కనే.. చాలా దగ్గరగా ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటం గమనార్హం. ముఖ్యమంత్రి మాస్కు పెట్టుకోకపోయినా.. మిగిలిన ఇద్దరు మాస్కు పెట్టుకోవటం ద్వారా.. సీఎం కు రిస్కు శాతాన్ని తగ్గించొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అదేమీ పట్టనట్లు.. ముఖ్యమంత్రిని అపాయంలోకి నెట్టేలా ముఖానికి మాస్కు పెట్టకపోవటం దేనికి నిరద్శనం? కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎంతలా ఉందన్నది తెలిసిందే. ఇలాంటి వేళ.. మాస్కు పెట్టుకోకుండా సాహసాలకు దిగటం సీఎం జగన్ కు మాత్రమే కాదు.. ఆయన చుట్టూ ఉన్న వారికి సరికాదన్నది మర్చిపోకూడదు. ముఖ్యమంత్రి జగన్ మాస్కు పెట్టుకోరు సరే.. కానీ చుట్టుపక్కల వారైనా పెట్టుకోవాలి కదా? నివేదిక విడుదల చేస్తూ దిగిన తాజా ఫోటోను చూస్తే.. ముగ్గురు ముగ్గురే అన్న భావన కలుగక మానదు.